పార్టీ ఆదేశిస్తే.. చేవెళ్ల లోక్‌సభ నుంచి బరిలోకి దిగుతా
– ఆరేళ్లు ఆరు నిమిషాల్లా గడిచిపోయాయి
– మండలి చైర్మన్‌గా స్వేచ్ఛగా పనిచేశా
– నా కొడుకు రాజకీయాల్లో రాడు
– విూడియా చిట్‌చాట్‌లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్
హైదరాబాద్, ఫిబ్రవరి25(ఆర్‌ఎన్‌ఎ) : పార్టీ ఆదేశిస్తే చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. సోమవారం విూడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.. పార్టీ ఆదేశిస్తే చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమని, నేను లోక్‌సభకు పోటీ చేయాలనే అనుకుంటున్నానని తన మనసులోని మాట బయటపెట్టారు. తనకు ఆరేళ్ల మండలి ఛైర్మన్ పదవి మంచి సంతృప్తినిచ్చిందన్న ఆయన.. సీఎం కేసీఆర్ నాపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకున్నా అని అనుకుంటున్నానన్నారు. నాటి నుంచి నేటి వరకు అర్థవంతమైన, ప్రశాంత వాతావరణంలో సభ జరిగిందని స్వామిగౌడ్ అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రసంగించారని, ఒకరిని మించి ఒకరు మంచిగా మాట్లాడారని గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ ఒక్కరోజు కూడా నన్ను సభ ఇలానే జరపాలని నిర్దేశించలేదని.. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ప్రతిపక్ష, అధికార పార్టీ సభ్యులు సహకరించారన్నారు.
ఆరేళ్లు ఆరు నిమిషాల్లా గడిచిపోయాయన్నారు. తాను చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. కౌన్సిల్ అంటే ఒక కుటుంబమని, ఎప్పుడూ నేను భాదపడలేదన్నారు. సంతృప్తి, మనస్ఫూర్తిగా ఉందన్నారు. ఎవరైనా నా మాటలకు నొచ్చుకుని ఉంటే సభను నడిపించడంలో భాగమేనని, ఎవరైనా భాదపడితే క్షమించాలని స్వామిగౌడ్ కోరారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడి ప్రజలతో ఓటు వేయించుకోవాలనే కసి నాలో ఉందని, అది ఏ ఎన్నికలైనా సరే అని స్వామిగౌడ్ అన్నారు. లోక్ సభ అయినా.. ఇంకా ఏదైనా సరే అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం శిరోధార్యమని, నాకు సొంత ప్రణాళిక ఏవిూలేదన్నారు. ఇక నా కొడుకుకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదన్న ఆయన.. సేవాభావంతో ఉన్న పనులు చేస్తున్నాడన్నారు. నా కొడుకు రాజకీయాల్లోకి రాడని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. నాది చేవెళ్ల నియోజకవర్గమైనా నా ఎమ్మెల్సీ నిధులు కరీంనగర్ కే ఖర్చు పెట్టానుతప్ప.. నా ఇంటి ముందు కనీసం లైట్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా వినియోగించలేదని స్వామిగౌడ్ తెలిపారు.