పార్లమెంట్‌ సమావేశాలకు ముందే గ్రాండ్‌ అలయన్స్‌

కోల్‌కతాలో మమతతో బాబు చర్చలు

22న జరిగే భేటీ వాయిదా

కోల్‌కతా,నవంబర్‌19(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాలకు ముందే విపక్ష పార్టీలు ఎన్‌డిఎకు వ్యతిరేకంగా ముందుకు రానున్నాయని టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు కార్యాచరణ సిద్దం చేస్తామని అన్నారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలతో కూడిన ‘మెగా ఫ్రెంట్‌’ ఏర్పాటుకు ఈనెల 22న న్యూఢిల్లీలో జరుపతలపెట్టిన సమావేశం వాయిదా పడింది. త్వరలోనే సమావేశం తేదీని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ‘మహాకూటమి’ ఏర్పాటు మంతనాల్లో భాగంగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చంద్రబాబు సోమవారంనాడిక్కడ సమావేశమయ్యారు. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలు, బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు ప్రయత్నాలు సహా పలు అంశలపై ఉభయులూ చర్చించారు. అనంతరం విూడియా సమాశంలో చంద్రబాబు, మమత కలిసి పాల్గొన్నారు. సుహృద్భావ వాతావరణంలో తాము ఉభయులూ పలు రాజకీయ అంశాలపైనా, మోదీ ప్రభుత్వ వైఫల్యాలపైనా చర్చించామని చెప్పారు. ‘మహాకూటమి’ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందేఈనెల ఈ 22న సమావేశం జరిపితే బాగుంటుందని అంతకుముందు అనుకున్నామని చెప్పారు. అయితే పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగనుండటంతో మరో తేదీన సమావేశం జరుపాలని నిర్ణయించామన్నారు. ఏ తేదీన సమావేశం ఉంటుందనేది తర్వాత తెలియజేస్తామన్నారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్లతో కలిసి పనిచేయడమే తమ మిషన్‌ అని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి పార్టీల సామర్థ్యంపై అడిగినప్పుడు, నరేంద్ర మోదీతో పోల్చుకుంటే తామంతా ఎక్కువ అనుభవం ఉన్నవాళ్లమేనని, బాగానే పరిపాలించగలమని చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో భాజపాయేతర పక్షాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోల్‌కతా చేరుకున్నారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఈ మేరకు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కోల్‌కతా చేరుకున్న చంద్రబాబుకు మమతా బెనర్జీ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. భాజపాయేతర భాగస్వామ్య పక్షాల సమావేశం నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే పలువురు భాజపాయేతర పార్టీ నేతలతో కొంతకాలంగా చంద్రబాబు భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.