పాల్వాయికి రాహుల్ గాంధీ
నో అపాయింట్‌మెంట్
ఇదో రకమైన అవమానం
న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి):
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డిని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పిలిచి అవమానించారనే వార్తలు ఇక్కడ గుప్పుమన్నాయి. తనను కలవాలని రాహుల్ గాంధీ పాల్వాయిని ఢిల్లీకి ఆహ్వానించిన విషయం విదితమే. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం రాహుల్ గాంధీని కలవాల్సి ఉంది. అయితే పాల్వాయికి ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను రాహుల్ గాంధీ అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారని సమాచారం. తనతో సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగా మీడియాకు చెప్పినందుకు రాహుల్ ఆగ్రహించారని అందుకే పాల్వాయికి అపాయిట్‌మెంట్‌ను రద్దు చేసినట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువజన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిసినట్లు భోగట్టా. ఈ సమయంలోనే పాల్వాయికి అపాయింట్‌మెంట్‌ను రద్దు చేస్తూ రాహుల్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. రాహుల్ గాంధీ తనను ఢిల్లీకి ఆహ్వా నించారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో చెప్పిన విషయం విదితమే. అదే సమయంలో తాను రాహుల్ గాంధీని కలుస్తానో లేదో కూడా చెప్పలేనని ఆయన అన్నారు. మరి ఆయన ఎందుకు అలా అన్నారో కానీ ఆయన అనుమానాలు నిజమవడం గమనార్హం. కేవలం తమ సమావేశ సమాచారాన్ని బయటికి చెప్పినందునే భేటీని రద్దు చేసుకుంటారా లేక అంతర్గతంగా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని పలువురు చర్చించుకుంటున్నారు.రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాలను రాహుల్ తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే పాల్వాయిని రాహుల్ ఢిల్లీకి ఆహ్వానించారని వార్తలు వచ్చాయి. పార్టీని చక్కదిద్దడానికి సోనియా, రాహుల్, గులాం నబీ ఆజాద్ ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. మొత్తం మీద, ఎంతో ఆశతో ఢిల్లీ వెళ్లిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డికి నిరాశే ఎదురైంది.