పీపుల్స్ ఫ్రంట్‌గా మారిన మహాకూటమి
పెద్దమనసుతో పట్టువిడిచిన కోదండరామ్
తెలంగాణ జనసమితి పోటీ 8 సీట్లకే పరిమితం
సిపిఐ మూడు సీట్లకే పోటీ
సీట్ల పంపిణీలో పట్టు వీడని కాంగ్రెస్
అర్థరాత్రి వరకు కోదండరామ్‌తో చర్చించిన కుంతియా,ఉత్తమ్
న్యూఢిల్లీ/హైదరాబాద్,నవంబర్17(జనంసాక్షి): తీవ్ర తర్జనభర్జనలు, చర్చలు..అర్థరాత్రి సమావేశాలు..చివరకు కోదండరామ్‌తో రాహుల్ చర్చోపచర్చల అనంతరం జనగమా టిక్కెట్ మళ్లీ పొన్నాల లక్ష్మయ్యకు దక్కింది. అలాగే మహాకూటమి పీపుల్స్ ఫ్రంట్‌గా పోటీలోకి రాబోతున్నది. గతంలో ప్రకటించిన మేరకే టిక్కెట్ల షేరింగ్‌పై కాంగ్రెస్ పట్టు నిలపుకుంది. మొత్తంగా జనగామ టికెట్‌పై ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత,పిసిసి మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకే జనగామ టికెట్ ఖరారైందన్న ప్రకటన వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా ప్రకటించారు. పొన్నాలకే జనగాం టికెట్ ఖరారు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ జనసమితి అదినేత ప్రొఫెసర్ కోదండరాంతో సుదీర్ఘ మంతనాల అనంతరం కుంతియా ఈ ప్రకటన చేశారు. బీసీ వర్గాల్లో నమ్మకం ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనగాం స్థానం నుంచి తప్పుకునేందుకు కోదండరాం ఒప్పుకున్నారని, అయితే కోదండరాం ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అన్నది అప్రస్తుతమన్నారు. కాగా జనగామ బరిలో కోదండరాం లేరని కుంతియా తెలిపారు. రాష్ట్రమంతా తిరిగి కోదండరాం ప్రచారం చేస్తారని చెప్పారు. కామన్ మినిమమ్ ప్రోగ్రాం కన్వీనర్‌గా కోదండరాం ఉంటారని ఆయన పేర్కొన్నారు. సీపీఐ, జనసమితి, టీటీడీపీ, కాంగ్రెస్ పొత్తులు కుదిరాయన్నారు. టీడీపీ 14 స్థానాల్లో, జనసమితి 8 చోట్ల, 3 స్థానాల్లో సీపీఐ పోటీ చేయనున్నట్లు
కుంతియా ప్రకటించారు. దీంతో టిజెఎస్ ప్రకటించిన 12 స్థానాల ప్రకటనకు విలువ లేకుండా పోయింది. కొండంత రాగం తీసి మళ్లీ అదే పాట పాడినట్లు సాగదీస్తూనే కాలయాపన చేశారు తప్ప సకాలంలో జాబితాలు ప్రకటించలేదు. శుక్రవారం రాత్రి సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీజేఎస్ కార్యాలయానికి వెళ్లారు. కోదండరాం, ఆ పార్టీ ముఖ్యనేతలతో దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. పార్టీ నేతలతో తొలుత అరగంటపాటు భేటీ అయ్యాక కోదండతో ఏకాంతంగా అరగంటపాటు చర్చలు జరిపారు. అర్ధరాత్రి తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఇందులో కుంతియాతో పాటు పొన్నాల కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. చివరకు పొన్నాల లక్ష్మయ్య పోటీ విషయంలో సందిగ్ధత వీడింది. జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నాల బరిలోకి దిగుతారని అప్పుడు ఆర్‌సీ కుంతియా స్పష్టం చేశారు. కోదండరాం పెద్ద మనుసు చేసుకుని ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు ఇచ్చారని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి 12 తర్వాత కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు ప్రొఫెసర్ కోదండరాంతో చర్చలు జరిపారు. అనంతరం కుంతియా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల నాడి కోదండరాంకు బాగా తెలుసని, అది తమకు బాగా లాభిస్తుందని కుంతియా అన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రచారానికి సోనియా, రాహుల్ కూడా వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటులో కూటమిలో అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. మ్యానిఫెస్టోలోని అంశాలను తూ.చ తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు. ప్రజాకూటమికి ప్రొఫెసర్ కోదండరాం కన్వీనర్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు. కేసీఆర్ పాలనను అంతమొందిచటమే లక్ష్యంగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఉద్దేశంతో భావసారుప్యత ఉన్న పార్టీలతో జట్టు కట్టామని పేర్కొన్నారు. తెలంగాణలో నాలుగు పార్టీలతో ఏర్పడిన మహాకూటమికి పీపుల్స్ ఫ్రంట్‌గా నామకరణం చేశారు. పీపుల్స్ ఫ్రంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపైనా వీరు చర్చించారు. దీనిపై భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, సీపీఐలతో శనివారం చర్చించి అందరి ఆమోదంతో సమష్టిగా ప్రజల్లోకి తీసుకెళతారు. పీపుల్స్ ఫ్రంట్ ప్రకటన తీర్మానానికి ఉద్యమ ఆకాంక్షల అజెండాను జతపరిచారు. తెరాస పాలనలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలేవీ నెరవేరలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను కూడా ఆ పార్టీ నెరవేర్చలేదు. సామాన్యుల కష్టాలు తీరలేదు. ఈ నాలుగేళ్ల విధ్వంస పాలనను కూల్చడానికి, ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడానికి ప్రతిపాదిత కనీస ఉమ్మడి ప్రణాళిక ఆధారంగా ఉద్యమ ఆకాంక్షలను సాధించడానికి కాంగ్రెస్, తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి కలిసి పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తూ తీర్మానించడమైందని తీర్మానంలో పేర్కొన్నారు.