పుట్ట లింగమ్మ ట్రస్ట్ జాబ్‌మేళాకు విశేష స్పందన – 1800 మంది దరఖాస్తు చేసుకోగా 1052 మంది ఎంపిక
– 47 కంపెనీల్లో అర్హత సాధించిన అభ్యర్ధులు
– రూ.15వేల నుంచి రూ.40వేతనాల కల్పన
– హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు జనం సాక్షి, మంథని : నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. మంథని పట్టణంలోని ఎస్‌ఎల్బీ గార్డెన్స్‌లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంథని నియోజక వర్గంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్ధులు హజరయ్యారు. ఈ జాబ్ మేళాలో సుమారు 47 బహుళ జాతి కంపెనీలు పాల్గొని విద్యార్హత ఆదారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 1800 మంది అభ్యర్ధులు వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోగా 1052 మంది అభ్యర్ధులను ఆయా కంపెనీల హెచ్‌ఆర్‌లు ఎంపిక చేశారు. జాబ్‌మేళాలు ఉద్యోగాలు సాధించిన అభ్యర్ధులకు రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వేతనాలు ఆయా కంపెనీలు చెల్లిస్తాయని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చేతుల మీదుగా ఎంపిక పత్రాలను అందజేశారు.
ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ… జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికై అభ్యర్ధులు నేరుగా వెళ్లి జాయిన్ కావాలన్నారు. ఎలాంటి అపోహాలకు పోవద్దని, ఒక్క అడుగు ముందుకు వేస్తేనే భవిష్యత్‌లో ఎన్నో సాధించే అవకాశం ఉందన్నారు. ఈ జాబ్‌మేళా ద్వారా వచ్చిన ఉద్యోగాన్ని వదులు కోకుండా తమ కలలకు సాకారం చేకూర్చుకోవాలని ఆయన సూచించారు. ఏ ఉద్యోగానిక వెళ్లినా ఎక్స్‌పీరియన్స్ అడుగుతారని, ఇలాంటి ఉద్యోగాలతో ఎక్స్‌పీరియన్స్‌సంపాదించుకోవచ్చని ఆయన హితవు పలికారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఎల్లవేళలా పేదవారికి అండగా నిలుస్తుందని, ట్రస్టు సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం జాబ్‌మేళాలో పాల్గొన్న వివిధ కంపెనీల హెచ్‌ఆర్‌లకు మెమోంటోలు అందజేశారు.