పురాణ కాలంలోనే గాజు తయారీ

ఐఐటి గాంధీనగర్‌ శాస్త్రవేత్తల వివరణ

గాంధీనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): గాజు తయారీ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇసుక నుంచి సిలికాను వేరు చేసి అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద గాజు ఆకారాలు తయారు చేయాల్సి ఉంటుంది. నిరంతర ఉష్ణానికి భట్టీలు అవసరమవుతాయి. అయితే ఈ పక్రియ ఏదో ఇటీవలి కాలపుది కాదని గాంధీనగర్‌ ఐఐటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రాచీన భారతదేశపు గాజు – చారిత్రిక, శాస్త్ర, సాంకేతికత అనే అంశంపై ఐఐటీ క్యాంపస్‌లో నాలుగురోజుల సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సులో ప్రసంగించిన డాక్టర్‌ అలోక్‌కుమార్‌ కానుంగో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రామాయణం, మహాభారతం, యజుర్వేదం, బ్రాహ్మణాలు, పురాణాలు, శుశ్రుత సంహిత, అర్థశాస్త్రం, వినయపిటకం వంటి ప్రాచీన గ్రంథాల్లో గాజు ప్రస్తావన ఉన్నట్టు ఆయన చెప్పారు. బంగారు తీగతో చుట్టిన గాజు స్ఫటికాల గురించి ఆ గ్రంథాల్లో రాశారని ఆయన వివరించారు. క్రీస్తుపూర్వం 1200-600 సంవత్సరాల మధ్యకాలంలో గాజు తయారీ గంగా-యుమన మైదానంలో ప్రాచుర్యంలోకి వచ్చిందని, తదనంతర కాలంలో ఇతర ప్రాంతాలకు వ్యాపించిందని డాక్టర్‌ కానుంగో వివరించారు. వేడి గాజులో గాలి ఊదుతూ రకరకాల ఆకారాలు వచ్చేలా చేసే పక్రియ భారత్‌లోనే పుట్టిందని తెలిపారు. పర్షియా దానిని ప్రాచుర్యంలోకి తెచ్చిందని అన్నారు.