పూరైన లక్ష ఇళ్లను చూపిస్తాం
– తలసాని
– చూపించండి చూద్దాం: భట్టి
హైదరాబాద్,సెప్టెంబరు 17(జనంసాక్షి):లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామన్న ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. లక్ష ఇండ్లు చూపించే వరకు భట్టి విక్రమార్క వెంబడి తిరిగి చూపిస్తానని మంత్రి తేల్చిచెప్పారు. నగరంలోని జియగూడ, గోడికేకబీర్, ఇందిరాగాంధీ కాలనీ, బన్సీలాల్‌పేట, కట్టెలమండిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను భట్టి విక్రమార్కకు మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి చూపించారు. అనంతరం మంత్రి తలసాని విూడియాతో మాట్లాడారు.పేద వర్గాలు గొప్పగా బతకాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ ఇండ్లను సీఎం కేసీఆరే డిజైన్ చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో మొత్తం 60 ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇవాళ చూసింది చాలా తక్కువ అని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఒక్కో ఇంటి విలువ రూ. కోటి వరకు ఉంటుందన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్మిస్తున్నామని చెప్పారు.లక్ష ఇండ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. కొల్లూరులో 15 వేల ఇండ్లు నిర్మించాం. అవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ ఇండ్లను పూర్తి చేసి పేదవారికి పంపిణీ చేయాలని ప్రభుత్వం ముందుకెళ్తుంది. లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు. బస్తీల సమక్షంలోనే ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇండ్ల పంపిణీలో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. డిమాండ్ ఉన్న చోట భవిష్యత్‌లో ఇలాంటి ఇండ్లను నిర్మిస్తామన్నారు. ఏ పార్టీలైనా పేదల సంక్షేమమే కోరుకుంటుందని మంత్రి తలసాని చెప్పారు.