పెట్టుబడులకు భారత్‌ అనుకూలం

ఫిన్‌టెక్‌ సదస్సులో ప్రధాని మోడీ

సింగపూర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): పెట్టుబడులకు భారతదేశం అనుకూలమైన గమ్యస్థానమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తమ దేశంలో అన్ని అనుకూలతలు ఉన్నాయని అన్నారు. సింగపూర్‌ ఫిన్‌టెక్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ అవసరం పెరుగుతోందని తెలిపారు. 130 కోట్ల మంది భారతీయులకు ఆర్థిక సంఘటితత్వం వాస్తవమైందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల భారతదేశంలో పరిపాలన పరివర్తన చెందిందని, ప్రభుత్వ సేవల బట్వాడా కూడా మారిందని చెప్పారు. అంతేకాకుండా నవ కల్పనలు, ఆశలు, నూతన అవకాశాలు ఉత్పన్నం కావడానికి సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతోందన్నారు. నూతన ప్రపంచంలో పోటీ తత్త్వాన్ని, శక్తి, సామర్థ్యాలను సాంకేతిక పరిజ్ఞానం నిర్వచిస్తోందన్నారు. మోదీ సింగపూర్‌ ఉప ప్రధాన మంత్రి టి షణ్ముగరత్నంతో కలిసి అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ ఎక్స్ఛేందజ్‌ (ఏపీఐఎక్స్‌)ను ఆవిష్కరించారు. ఫిన్‌టెక్‌ వల్ల ఒనగూరిన ఆరు గొప్ప ప్రయోజనాలను భారతదేశం స్పష్టంగా వివరిస్తోందని మోదీ తెలిపారు. యాక్సెస్‌, ఇంక్లూజన్‌, కనెక్టివిటీ, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, ఆపర్చ్యూనిటీ, అకౌంటబిలిటీ అనే ఆరు ప్రయోజనాలు ఫిన్‌టెక్‌ వల్ల చేకూరాయని వివరించారు. సదస్సు ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించిన కార్యక్రమమని, అంతేకాకుండా ఇదొక పండుగ అని తెలిపారు. నమ్మకాన్ని ఉత్సవంగా, వేడుకగా జరుపుకోవడమని తెలిపారు. నవ కల్పన స్ఫూర్తి పట్ల, ఊహా శక్తి ఘనత పట్ల ఉన్న నమ్మకాన్ని వేడుకగా జరుపుకోవడమేనన్నారు. యువత శక్తి, సామర్థ్యాలపై నమ్మకాన్ని, మార్పుకోసం వారి తపన పట్ల నమ్మకాన్ని, ప్రపంచాన్ని మెరుగైన స్థానంగా తీర్చిదిద్దడంపై నమ్మకాన్ని వేడుకగా జరుపుకోవడమన్నారు. ప్రధాని రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సింగపూర్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన థాయ్‌లాండ్‌ ప్రధాన మంత్రి జనరల్‌ ప్రయుత్‌ ఛాన్‌ ఓ ఛాతోనూ, ఆస్టేల్రియా ప్రధాన మంత్రి స్కాట్‌ మారిసన్‌లతో సమావేశమయ్యారు.