పెద్దల సభలో ఎంపీల పిల్ల చేష్టలు
– ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల బిల్లుపై రగడ – ఎస్పీ, బీఎస్పీల సభ్యుల బాహాబాహీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5 (జనంసాక్షి):
పెద్దల సభలో పెద్దతనంతో వ్యవహరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ గళాన్ని వినిపించాల్సిన ఎంపీలు, చిన్నపిల్లల్లా కొట్లాటకు దిగారు. ఈ హైడ్రామాకు రాజ్యసభ వేదికైంది. ఎస్పీ, బీఎస్పీ సభ్యుల తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని ఎదుటే గల్లాలు పట్టుకొని వాదులాటకు దిగారు. ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వోగ్యులకు ప్రమోషన్లు కల్పించే బిల్లు సభలో రగడ సృష్టించింది. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీల వాదులాటతో అట్టుడికింది. పదోన్నతుల బిల్లు విషయంలో ఎస్పీ, బీఎస్పీ సభ్యుల మధ్య వివాదం నెలకొంది. బుధవారం ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే.. బొగ్గు కుంభకోణంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని రాజీనామా చేయాలని పట్టుబట్టడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. సభ తిరిగి సమావేశమైన అనంతరం అదే పరిస్థితి నెలకొంది. గందరగోళం మధ్యే డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదోన్నతుల బిల్లును సభలో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. దీంతో ప్రతిపక్షాల నిరసనల మధ్యే కేంద్ర మంత్రి వి.నారాయణస్వామి బిల్లును ప్రవేశపెట్టారు. ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా గందరగోళం నెలకొంది. ఎస్పీ, బీఎస్పీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ ఎంపీలు తమ స్థానాల్లో నిలుచొని నినాదాలు చేశారు. బిల్లును వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. వారికి ప్రతిగా బిల్లుకు మద్దతు తెలుపుతూ బీఎస్పీ సభ్యులు నినాదాలు చేశారు. తమ స్థానాల్లోంచి లేచి వాగ్వాదానికి దిగారు. ఒకరి చేతులోని బిల్లు ప్రతులను లాక్కొని మరొకరు చించే ప్రయత్నాలు చేశారు. మరోవైపు, ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్ సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు వెల్‌లోకి దూసుకెళ్తుండగా.. బీఎస్పీ సభ్యుడు అవతార్ సింగ్ కరింపురి ఆయనను అడ్డుకున్నారు. ఆయన కాలర్‌ను పట్టుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో మార్షల్స్‌ను సభలోకి పిలిపించారు. ఎంతకీ సభ సజావుగా సాగకపోవడంతో డిప్యూటీ చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ప్రభుత్వం, బీఎస్పీ తీరుపై సమాజ్‌వాదీ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. బొగ్గు కుంభకోణంపై రగడ సాగుతుండగా ఎస్సీ,ఎస్టీ, ప్రమోషన్ల బిల్లును ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టింది. బొగ్గు స్కాంపై చర్చ జరగకుండా తప్పించుకునేందుకే ఈ బిల్లును తీసుకువస్తోందని మండిపడింది. పదోన్నతుల బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ములాయం స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఈ బిల్లు వల్ల సీనియారిటీ ప్రాతిపదికకు విఘాతం కలుగుతుందన్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ తమ ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు. మరోవైపు, ఎస్పీ తీరును ప్రభుత్వం, బీఎస్పీ తప్పుబట్టింది. ఆ పార్టీ ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. రాజ్యసభలో జరిగిన రగడ దురదృష్టకరమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. బీజేపీ తీరుపై ఆమె విమర్శలు ఎక్కుపెట్టారు. పదోన్నతుల బిల్లుపై చర్చించేందుకు ఆ పార్టీ తమకు హామీ ఇచ్చిందని, కానీ, బొగ్గు కుంభకోణంపై సబను స్తంభించజేసి ద్వంద్వ వైఖరి పాటించిందని విమర్శించారు.