పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కాంగ్రెస్‌కు పట్టవు

ఎంతసేపూ మోదీని దింపడమే లక్ష్యంగా రాహుల్‌ విమర్శలు

మధ్యప్రదేశ్‌ ప్రచారంలో అమిత్‌షా విమర్శలు

భోపాల్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి ‘మోదీ ఫోబియా’ పట్టుకుందని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఎద్దేవా చేశారు. తాము దేశంలోని పేదరికాన్ని దూరం చేసేందుకు పనిచేస్తుంటే, ఆ పార్టీ మాత్రం మోదీని పదవి నుంచి తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన విమర్శించారు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నర్సింగ్‌పూర్‌లో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. 28న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

గాంధీ-నెహ్రూ కుటుంబం నాలుగు తరాల నేతలు దేశాన్ని పాలించారు. గ్రామాల్లో విద్యుత్‌ సదుపాయం కల్పించలేకపోయారు. పేదలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వలేదు. కాంగ్రెస్‌ పార్టీకి, రాహుల్‌కి మోదీ ఫోబియా పట్టుకుందన్నారు. మోదీని అధికారంలో నుంచి దించాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. కానీ మేము మాత్రం దేశంలోని పేదరికాన్ని, నిరుద్యోగ పరిస్థితి తొలగించాలని కృషి చేస్తున్నాం. నాలుగు తరాల ఆ కుటుంబ పాలనలో దేశానికి ఏం మేలు జరిగిందో రాహుల్‌ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం 129 అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టింది. దేశ భద్రత విషయంలోనూ ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అయితే రాహుల్‌ ప్రసంగాలు ఇచ్చే ప్రతిసారి మోదీ, మోదీ అంటూ ప్రధాని పేరును తలుచు కుంటున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో రాహుల్‌ ఇచ్చిన 22

నిమిషాల ప్రసంగంలో మోదీ పేరును 44 సార్లు పలికారు. ఆయన కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేస్తున్నారా? భాజపా తరఫునా? అని నేను ఆశ్చర్యపోయాను’ అని వ్యాఖ్యానించారు. ఉరీలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో దేశ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మోదీ పీవోకేలో మెరుపు దాడులకు ఆదేశించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో తొమ్మిదో స్థానంలోనే ఉండేది. ఇప్పుడు ఆరో స్థానానికి చేరుకుంది. ఆ ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చే నాటికి ఆ జాబితాలో యూకేను అధిగమించి.. భారత్‌ ఐదో స్థానానికి చేరుకోనుంది’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.