పేపర్‌బోయ్‌ నుంచి ఐఐఎం విద్యార్థిగా…

శివకుమార్‌ కల సాకారం

బెంగళూరు : 23 ఏళ్ల శివకుమార్‌ నిన్నటివరకూ పొద్దున్నే వార్తాపత్రికలు పంచేవాడు. ఈరోజు తానే వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ఇంజినీరింగ్‌ చదివిన శివకుమార్‌ కోల్‌కతా ఐఐఎంలో సీటు సంపాదించాడు మరి. గత పదేళ్లుగా శివకుమార్‌ పేపర్‌బోయ్‌గా పనిచేస్తూనే చదువుకున్నాడు. ఉదయం 4 గంటలకు లేచి 8 గంటల వరకూ పనిచేసేవాడు. కాలేజీకి వెళ్లి వచ్చాక మరో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేసేవాడు. ‘ఇన్ని పనులు చేస్తూ చదువుకోవడం కష్టమే … కానీపై స్థాయికి ఎదగాలంటే కష్ట పడక తప్పదు కదా…. ‘ అంటున్నాడు తొలియత్నంలోనే క్యాట్‌ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన శివకుమార్‌. చదువైపోయాక మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబసభ్యులను ప్రపంచ పర్యటనకు తీసుకెళ్లాలన్నది అతని ఆశ. ఆ తర్వాత ఒక ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ నెలకొల్పి తనలా పెద్ద పెద్ద కలలు కనేవారికి చేయూతనివ్వాలన్నది శివకుమార్‌ అశయం.