పైలట్‌ కెప్టెన్‌ కథ్‌పాలియా లైసెన్స్‌ రద్దు

పైలట్‌ కెప్టెన్‌ కథ్‌పాలియా లైసెన్స్‌ రద్దు

మద్యం సేవించి రావడంతో పక్కన పెట్టిన అధికారులు

న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఎయిరిండియా(ఏఐ) బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో ఒకరైన సీనియర్‌ పైలట్‌ కెప్టెన్‌ అరవింద్‌ కథ్‌పాలియా లైసెన్సును మూడేళ్ల పాటు రద్దు చేస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అయిన కథ్‌పాలియా ఆదివారం మధ్యాహ్నం దిల్లీ నుంచి లండన్‌ వెళ్లాల్సిన విమానం నడపాల్సి ఉండగా, కొద్ది సేపటి ముందు నిర్వహించిన శ్వాస పరీక్షలో మద్యం సేవించి పట్టుబడ్డారు. దీంతో ఆయనను దించేసి మరో పైలట్‌తో విమానం నడిపించారు. 55 నిమిషాలు ఆలస్యంగా విమానం బయల్దేరింది. కాగా అరవింద్‌ కథ్‌పాలియాపై డీజీసీఏ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. నవంబరు 11వ తేదీ నంచి ఆయనపై సస్పెన్షన్‌ వర్తిస్తుందని, మూడేళ్ల పాటు ఆయనను సస్పెండ్‌ చేసినట్లు డీజీసీఏ అధికారులు సోమవారం వెల్లడించారు. నిబంధనల ప్రకారం విమానయాన సిబ్బంది విమానం బయల్దేరే 12 గంటల ముందు నుంచి మద్యం తాగకూడదు. ప్రయాణానికి ముందు వారికి తప్పనిసరిగా శ్వాసపరీక్ష జరగాలి. పైలట్లు ఎవరైనా తొలిసారి మద్యం శ్వాసపరీక్షలో విఫలమైతే వారి లైసెన్సును 3 నెలల పాటు రద్దు చేస్తారు. అదే రెండోసారి అయితే మూడేళ్లపాటు, మూడోసారి కూడా దొరికితే శాశ్వతంగా లైసెన్సు రద్దు చేస్తారు. 2017లో కూడా ఓసారి కథ్‌పాలియా శ్వాసపరీక్ష నుంచి తప్పించుకోవడంతో అప్పట్లో ఆయన లైసెన్సును 3 నెలల పాటు సస్పెండ్‌ చేశారు. తాజా ఘటనతో కథ్‌పాలియా లైసెన్సును 3 సంవత్సరాలు రద్దు చేశారు.