పోలవరం టెండర్లు రద్దు చేయండి

అవకతవకలపై విచారణ జరిపించండి
ఈటెల డిమాండ్‌
హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి): పోలవరం టెండర్లను రద్దు చేయాలని, ఈ టెండర్ల వ్యవహారంపై సిటింగ్‌ జడ్జిచే విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభాపక్షం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం టిఆర్‌ఎస్‌ ఎల్‌ఫి కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులే లేవని కేంద్రమంత్రి జైరాం రమేష్‌ స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. గత టెండర్లను రద్దు చేసి తిరిగి సోమా కంపెనీకి టెండర్లు కట్టబెట్టడం వెనక ఉన్న మతలబ్‌ ఏమిటని ఆయన ప్రశ్నించారు. సోమ కంపెనీ టిడిపి ఎంపి రమేష్‌కు చెందినదని ఆయన ఆరోపించారు. గతంలో 4100 కోట్ల రూపాయలు ఉన్న టెండర్లను రద్దు చేసి ఇప్పుడు 4500లకు ఎలా పెంచారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాదాపు 400 కోట్ల వరకు పెంచడం వెనక ఉన్న అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. షూ కంపెనీకి టెండరు వస్తే నానా యాగి చేసిన చంద్రబాబు నేడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. పోలవరం టెండర్లు ఆయన పార్టీకి చెందిన వారికి దక్కినందుకే ఆయన మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ టెండర్లలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు వేల కోట్ల రూపాయలను పంచుకునేందుకు , రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆయన ఆరోపించారు. ఈ టెండర్లలో అక్రమాలు జరిగాయని స్వయాన క్యాబినెట్‌ మంత్రులే విమర్శలు చేస్తున్నారని స్పీకర్‌ అన్నారు. ప్రజాధనాన్ని రక్షించలేకుంటే ఇక ప్రభుత్వం ఉండి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేని ఆయన అన్నారు. ప్రజాధనాన్ని దోచుకునేందుకు టెండర్ల మొత్తాన్ని ప్రభుత్వం పెంచిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే టెండర్లను రద్దు చేయాలని, టెండర్ల మొత్తాన్ని పెంచడం వెనక ఉన్న రహస్యాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు.