పోలవరం పనులపై.. శ్వేతపత్రం విడుదల చేయాలి
– 58శాతం పనులు పూర్తయితే మేనెలలో నీళ్లెలా ఇస్తారు?
– రాజధానిపేరుతో అప్పులు చేసినా శాశ్వత భవనాలు లేవు
– విలేకరుల సమావేశంలో ఉండవల్లి అరుణ్‌కుమార్
రాజమండ్రి, అక్టోబర్25(జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్టు 58శాతం పూర్తి అయ్యిందని చెబుతూనే మే నెలలో నీళ్లు ఇస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాఖ్యానించారు. పోలవరం పనులపై శ్వేతపత్రం విడుదలచేసి ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పోలవరం పై చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వంపై ఉందని అన్నారు. మున్సిపాల్టీల్లో 8శాతం వడ్డీకి కమర్షియల్ బ్యాంకుల నుంచి 12,600 కోట్లు అప్పులు తెచ్చేందుకు జీవో విడుదల చేశారని, అయితే ఆఖరి 4నెలల్లో ఎందుకు అప్పులు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని అన్నారు. రాజధాని పేరుతో అప్పులు చేసినా శాశ్వత భవనాలు లేవన్నారు.కేవలం తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్నారని, అవికూడా ఇప్పటికి పూర్తికాలేదన్నారు. వీటిని భట్టి అసలు రాజధానిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రశ్నించదని ఆయన విమర్శించారు. ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడు ఏది చెబితే అదే చేస్తారని ఉండవెల్లి మండిపడ్డారు. ఉన్నత స్థానంలోకి వెళ్లినపుడు నాయకులు కాస్త బాధ్యతగా వ్యవహరించాలని, ఆంధ్ర ప్రదేశ్‌లో అలా జరగడంలేదన్నారు. వ్యవస్థలపై ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విధానాలు కాకుండా, సొంత ఎజెండాలను ముందుకు తీసుకువెళుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ధర ప్రకారం ఇసుక దొరికితే తన ఆరోపణలు వెనక్కి తీసుకుంటానన్నారు. చంద్రబాబు మళ్లీ గెలిస్తే తనకు నష్టం లేదని ఉండల్లి తెలిపారు.