పోలవరం మట్టినీ వదలని అక్రమార్కులు?

సొమ్ము చేసుకుంటున్న వైనం పట్టని అధికారులు
ఏలూరు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్టులో ప్రతీరోజూ తవ్వి తీస్తున్న మట్టిని బయటకు తరలిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న మట్టిని బయట అవసరాలకు కొందరు అమ్మకుంటున్నారు. పోలవరం ప్రధాన గట్టు నుంచి ప్రధాన రహదారి విూదుగా ఈ అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు మట్టి అక్రమంగా తరలిపోతుండగా గోదావరి తీరంలో మట్టి మరోవిధంగా తరలించుకుపోతున్నారు. దీనిలో రాయిని మాత్రం ప్రాజెక్టు
అవసరాలకు వినియోగిస్తుండగా స్పిల్‌వే నిర్మాణం నిమిత్తం తవ్వుతున్న మట్టిని బయటకు తరలించేస్తున్నారు. దీనిని ప్రజాప్రయోజనార్థం వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలవరం గ్రామాన్ని గోదావరి వరదల నుంచి రక్షించడానికి నిర్మిస్తున్న నెక్లెస్‌ బండ్‌ నిర్మాణంలో ఈ మట్టిని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. కొద్దిరోజుల పాటు బండ్‌ నిమిత్తం మట్టి రవాణా కాగా అనంతరం ఈ మట్టి ఇతర ప్రాంతాలకు తరలిపోవడం ప్రారంభ మైంది. పగటిపూట రవాణా ప్రారంభించిన అక్రమార్కులు తర్వాత అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని గ్రహించి రాత్రిపూట చేపట్టారు.  అధికారులు దృష్టికి వెళ్లడం రెండు మూడు రోజులు నిఘా ఉంచడం తర్వాత పైనుంచి ఆదేశాలు రావడం వదలిపెట్టడం సాధారణమైంది. పోలవరం మట్టి తవ్వకాలపై అధికారులు మాట్లాడుతూ ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలుతున్న మట్టి రవాణాను నిలుపుదల చేశామన్నారు. నెక్లాస్‌బండ్‌ నిర్మాణం కోసం వెళ్లే టిప్పర్ల నెంబర్లను పోలవరం ప్రాజెక్టు అధికారులకు అందజేసి వాటికే మట్టి లోడింగ్‌ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు.