పోలవరం లక్ష్యాన్ని దెబ్బతీయలేరు
వైకాపా దుష్పచ్రారాలను ప్రజలు నమ్మడం లేదు : మంత్రి దేవినేని
విజయవాడ,అక్టోబర్24(జనంసాక్షి): రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పట్టిసీమను వేగంగా పూర్తిచేసి రాయలసీమలో కరువు తీవ్రతను తగ్గించగలిగామన్నారు. పోలవరం ప్రాజెక్టుపై అనవసర అపోహలు వీడాలని, దుష్పచ్రారం ఆపాలని మంత్రి దేవినేని ఉమ సూచించారు. పట్టిసీమ చేపట్టినప్పడు చేసిన విమర్శలనే ఇప్పుడు కొనసాగిస్తూ రావడం,పోలవరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతినేలా చేయడం తగదన్నారు. పోలవరం పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోమారు అయన స్పష్టం చేశారు. కేవలం వైకాపా దీనిని ఓ ప్రచారంగా చేసుకుని లబ్దిపొందాలని చూస్తోందని మండిపడ్డారు. రూ.30వేల కోట్లతో పోలవరం పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. కేంద్రమే ఈ ఖర్చును భరిస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో అన్ని జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. పట్టిసీమ కారణంగా రాయలసీమకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. డెల్టా రైతలుకు ప్రయోజనం కలిగిందని అన్నారు. రూ.1650 కోట్లతో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని కూడా త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దీని ద్వారా విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలకు పుష్కలంగా నీరందిస్తామని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 2లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామన్నారు. రూ.24 వేల కోట్లను రైతు రుణమాఫీ పథకానికి వెచ్చించామన్నారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల ఆయకట్టుకు పట్టిసీమ ద్వారా వస్తున్న సాగునీరు అవసరం లేదని చెప్పగలరా? అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. పట్టిసీమలో పంపింగ్ ప్రారంభించకపోతే రైతాంగానికి ఎంతో నష్టం వాటిల్లేదన్నారు. పోలవరం, పట్టిసీమల గురించి తెలియకనే ఎక్కువ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులను పూర్తిచేసి రైతాంగాన్ని ఆదుకోవడం ప్రభుత్వం కర్తవ్యమని అన్నారు. ఈ జిల్లాలకు పట్టిసీమ నుంచి నీరు రావడం వల్ల కలిగిన మేలు రైతులను అడిగి తెలిసుకోవాలని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఒక విమర్శలు, కొత్త ప్రాజెక్టు మొదలుపెడితే మరో విమర్శలు ఇదేనా వైకాపా తీరని మండిపడ్డారు.