పోలీసుల నేత్రదానం కార్యక్రమం
ఏలూరు,అక్టోబర్19(జనంసాక్షి): పోలీసు అమర వీరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 21 వ తేదీన నిర్వహించే పోలీసు అమరవీరుల స్మృతి దినం సందర్భంగా.. శుక్రవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో నేత్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్‌పి ఎం.రవి ప్రకాష్, ఐపిఎస్ ల సమక్షంలో జిల్లాలో ఎస్‌బిలో పనిచేస్తున్న ఎస్‌ఐ రాంబాబు తన నేత్రాలను ఇండియన్ రెడ్ క్రాస్ వారికి దానం చేశారు. ఎస్‌పి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమం పోలీసులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఇది ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. నేత్రదానం వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, దాని వల్ల కంటి చూపులేని వారికి కంటి చూపు ఇచ్చినవారవుతారని తెలిపారు. మనిషి మరణించినా, ఆ మనిషి తాలూకు నేత్రాలు మరొకరికి చూపునిస్తాయని హితవు పలికారు. ఎస్‌పి, ఎస్‌ఐ రాంబాబులు ఇద్దరూ తమ నేత్రాలను ఇండియన్ రెడ్ క్రాస్ వారికి దానం చేసినందుకు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పి కె.ఈశ్వరరావు, ఎఆర్ అదనపు ఎస్‌పి ఎం.మహేష్ కుమార్, ఎస్‌బి, సిఐ. ఎస్.కొండలరావు, డిసిఆర్‌బి సిఐ. జివి.కృష్ణారావులు పాల్గొన్నారు.