ప్రకాశం జిల్లాలో పరువు హత్య?

– యువతి అనుమానాస్పద మృతి
– ప్రేమ వ్యవహారమే కారణమంటున్న స్థానికులు
ప్రకాశం, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : ప్రకాశం జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. యువతి ఆత్మహత్య చేసుకుందని తండ్రి చెబుతుంటే.. పరువు హత్యంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. కొమరవోలు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన పాపయ్య కుమార్తె ఇంద్రజ గిద్దలూరులో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఆమె సోమవారం అనుమానస్పద రీతిలో చనిపోగా.. తండ్రి వేకువ జాము సమయంలో ఊరి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఊరిశివారులో యువతి అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. అనంతరం యువతి తల్లిదండ్రులతో పాటూ బంధువులను స్థానికులు ప్రశ్నించారు. అయితే ప్రేమ వ్యవహారమే యువతి మరణానికి కారణమని తెలుస్తోంది. గిద్దలూరులో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఇంద్రజకు ఓ దళిత యువకుడితో పరిచయం పెరిగి ప్రేమగా మారినట్లు సమాచారం. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారట. యువతిని మందలించినా వెనక్కు తగ్గలేదు. తల్లిదండ్రులపై కోపంతో భోజనం చేయడం కూడా మానేయడంతో.. ఆమెను హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. అక్కడా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. తిరిగి సొంత ఊరికి పంపించారు. ఈ క్రమంలో యువతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు.. ఆమెను హతమార్చి ఆత్మహత్య పేరుతో డ్రామాలాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఘటపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.