ప్రకృతి సేద్యంతో..  ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం


– సాంకేతికతను ప్రకృతికి అనుసంధానం చేస్తున్నాం
– దీని కోసం ప్రపంచమంతా ఆసక్తితో ఎదురుచూస్తోంది
– అధికారులు బాధ్యత తీసుకుని ప్రకృతి సేద్యంపై దృష్టిపెట్టాలి
– జన్మభూమిలో ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
– ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధిదారుని వరకు చేరాలి
– బీసీలకు కొత్తగా పది కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం
– కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి28(జ‌నంసాక్షి) : ప్రకృతిసేద్యంపై అధికారులు బాధ్యత తీసుకుని దృష్టి పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ఏపీలో చేపట్టిన ప్రకృతి సేద్యంపై దావోస్‌లో చర్చ జరిగిందని, ప్రకృతి సేద్యం ప్రపంచానికి మనం అందించే కానుక అని, ప్రకృతి సేద్యం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సాంకేతికతను ప్రకృతికి అనుసంధానం చేస్తున్నామని, దీని కోసం ప్రపంచమంతా ఆసక్తితో ఎదురుచూస్తోందన్నారు. అధికారులు బాధ్యత తీసుకుని ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. జన్మభూమి కార్యక్రమంలో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కారం చేయాలని, పరిష్కారం చేయలేని వాటిని ఎందుకు చేయలేదో ప్రజలకు తెలియజేయాలని ఆయన ఆదేశించారు. ప్రత్యేక ¬దా సాధన సమితి ఫిబ్రవరి 1న బంద్‌కు పిలుపు ఇచ్చిందని, బంద్‌కు ఇబ్బంది లేకుండా 2, 3, 4 తేదీలతో… జన్మభూమి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అన్న క్యాంటీన్ల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆదరణ, ఇతర సంక్షేమ
కార్యక్రమాలపై క్షుణ్ణంగా సవిూక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుని వరకు చేరేలా చూడాలన్నారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు ఏం చేయగలుగుతామో ఇప్పట్నుంచే ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు సూచించారు. ఎక్కడా నీటికి ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని సూచించారు. పశుపోషణకు అస్సలు నీటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు.  ఏ కార్యక్రమం చేసినా ప్రజల్లో సంతృప్తిశాతం పెరగాలని.. జనాభా దామాషా ప్రకారం పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని కలెక్టర్లతో చెప్పారు. సమాజంలో ఎవరూ మేం పేదవాళ్లం.. మాకు గుర్తింపు లేదని బాధపడే పరిస్థితి ఉండకూడదన్నారు. అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా సంక్షేమ ఫలాలు అందిస్తామని సీఎం సృష్టం చేశారు. బీసీలు ఎప్పటి నుంచో అడుగుతున్నందున… కొత్తగా 10 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.