ప్రజాగర్జనతో ఎరుపెక్కిన చింతూరు

కదం తొక్కిన లెఫ్ట్‌ కార్యకర్తలు
కాకినాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సిపిఎం-సిపిఐ-జనసేనల ఆధ్వర్యంలో చింతూరు సెంటర్‌లోని పాత ప్రభుత్వ ఆసుపత్రి మైదానంలో సోమవారం మధ్యాహ్నం ప్రజా గర్జన సభ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం చింతూరు మండలమంతా ఎర్ర సైన్యంతో ఎరుపెక్కింది. కళాకారులతో కలిసి సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ కుమార్‌ డప్పు కొడుతూ ఆనందించారు. ప్రజా గర్జనకు వచ్చిన చిన్నారుల చేతుల్లో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఎర్ర సైన్యం-జనసేన కూటమి లు చింతూరులో మహా గర్జన ర్యాలీగా బయలుదేరాయి. మరో వైపు.. యువకులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. చింతూరు వీధులన్నీ ఎర్ర జెండాలతో, డప్పు కళాకారుల వాయిద్యాలతో, చిన్నారుల సందడితో, యువకుల బైక్‌ ర్యాలీతో ¬రెత్తాయి. సుమారు అయిదేళ్లుగా ముంపు మండలాల్లోని ఆదివాసీలు సమస్యల వలయం నుండి బయటపడకపోవడంపై సిపిఎం చేసిన పోరాటాల నడుమ ఎన్నో సమస్యలను గిరిజనులు పరిష్కరించుకున్నారు. ఇంకా ప్రధాన సమస్యలు మన్యాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. గిరిజనుల సమస్యల పరిష్కారాల కోసం మన్యవాసులు ఈ ప్రజా గర్జన సభకు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం నేతలు ప్రసంగిస్తున్నారు. ఈ సభలో ప్రధాన వక్తలుగా సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు వి.శ్రీనివాసరావు, మాజీ మంత్రి, జనసేన నాయకులు పసుపులేటి బాలరాజు, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెవి.సత్యనారాయణ లు పాల్గొన్నారు