ప్రజాస్వామ్య పరిరక్షణెళి విపక్షాల లక్ష్యం

– సరైన సమయం వచ్చినప్పుడు అందరూ కలిసి నడుస్తారు
– మిత్ర ధర్మం మేరకే ఇతర పార్టీలకు సీట్లు కేటాయించాం
– దానివల్ల కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేవిూ లేదు
– ప్రధాన లక్ష్యం కోసం పోరాటంలో చిన్నచిన్న త్యాగాలు లెక్కచెయ్యొద్దు
– ఐదేళ్లలో హావిూల అమల్లో మోదీ విఫలమయ్యాడు
– జాతీయతాభావం అంటూ మోదీ నియంతలా వ్యవహరిస్తున్నాడు
– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శ్యామ్‌ పిట్రోడా
న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : మోదీ ఐదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం చేశాడని, ఏకపక్ష నిర్ణయాలతో దేశంలోని వ్యవస్థలను బ్రష్టు పట్టించారని, మోదీని గద్దెదించి ప్రజాస్వామ్య పరిరక్షణస్త్ర ధ్యేయంగా విపక్షాలు పోరాడుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శ్యామ్‌ పిట్రోడా వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం విపక్ష పార్టీలు విమర్శలు చేసుకున్నా.. వారిదంతా ఒకటే లక్ష్యమని, సరైన సమయంలో అంతా ఏకతాటిపైకి వస్తారని అన్నారు. యూపీలో మహాకూటమి సభ్యులైన ఎస్పీ, బీఎస్పీ నేతలు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆయా పార్టీలతో కాంగ్రెస్‌కు ఉన్న విభేదాలన్నీ త్వరలోనే సమసిపోతాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, దేశంలో శాంతి నెలకొల్పడం, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ఉమ్మడి లక్ష్యాలతో విపక్షాలు పోరాడుతున్నాయన్నారు. దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే.. పెట్టుబడులు వస్తాయని, తద్వారా ఉద్యోగ సృష్టి జరగుతుందని వివరించారు. మహాకూటమి నాయకత్వంపై తనకు విశ్వాసముందని పిట్రోడా తెలిపాడు. సరైన సమయం వచ్చినప్పుడు అందరూ కలిసి నడుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ చరిత్రలో అతితక్కువ స్థానాలు పోటీ చేస్తోంది 2019లోనే అని ప్రధాని మోదీ చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. మిత్ర ధర్మం మేరకే సీట్లు కేటాయించామని.. దీని వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం వాటిల్లదని ధీమా వ్యక్తం చేశారు. ఒక ప్రధాన లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు లెక్క చెయ్యొద్దని చెప్పుకొచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని పిట్రోడా విమర్శించారు. అధికారమే లక్ష్యంగా.. రైతుల ఆదాయ రెట్టింపు, రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాకి రూ.15లక్షలు లాంటి అనేక మోసపూరిత హావిూలను గుప్పించారన్నారు. ఈ సందర్భంగా ఆయన మోదీని హిట్లర్‌తో పోల్చారు. జాతీయతాభావం అంటూ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రియాంక వాద్రా సేవలను కేవలం వారణాసికే పరిమితం చేయోద్దని పార్టీ నిర్ణయించినందు వల్లనే ఆమె పోటీలో నిలవలేదని పిట్రోడా తెలిపారు.