ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి

– ఏం తప్పుచేశారని బాబు, లోకేశ్‌ల పాస్‌పోర్ట్‌ లు సీజ్‌చేస్తారు
– కోర్టుబోనులెక్కే విూరా.. అవినీతిపై మాట్లాడేది
– విజయసాయిరెడ్డిపై మండిపడ్డ మంత్రి పత్తిపాటి పుల్లారావు
గుంటూరు, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబునాయుడుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు, ఆరోపణలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌ ల పాస్‌ పోర్ట్‌ లు సీజ్‌ చేయాలన్న వ్యాఖ్యలను ఖండించారు. గుంటూరులో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  కష్టపడే నాయకుడి కాళ్లు లాగేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని, ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ ఏం తప్పు చేశారని పాస్‌ పోర్ట్‌ లు సీజ్‌ చేస్తారు అని ప్రశ్నించారు. కోర్టు అనుమతి పొంది పక్కదేశాలకు వెళ్లేవారు చంద్రబాబు గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అవినీతికి పాల్పడి కోర్టు బోను ఎక్కే వీళ్లా మాట్లాడేది అని అన్నారు. ఏపీలో అభివృద్ధి జరుగుతుంటూ అవినీతి ముద్ర వేస్తున్నారని, సీఎం చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనబడుతోందని అన్నారు. ప్రతిపక్షాలకు 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీజేపీతో లాలూచీ పడిన వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రపంచ దేశాల నుంచి చంద్రబాబు, లోకేష్‌కు అవార్డులు వస్తున్నాయని, అలాంటివారిని బోనెక్కించాలని, ముద్దాయిలు అనడం హాస్యాస్పదమని అన్నారు. ఐదు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అనడానికి నోరెలా వచ్చిందని ప్రత్తిపాటి ప్రశ్నించారు. అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆయన అన్నారు. విపక్షాలకు కేంద్రాన్ని నిలదీసే దమ్ములేదని, కేంద్రం సహకరించకున్నా ఏపీ ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు కష్టపడుతున్న చంద్రబాబను విమర్శించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు.

తాజావార్తలు