ప్రతిపక్షాల రివ్యూ పిటీషన్‌పై.. 

విచారణకు సుప్రీం ఓకే
– వచ్చేవారం విచారణ చేస్తామన్న సుప్రిం
న్యూఢిల్లీ, మే3(జ‌నంసాక్షి) : లోక్‌ సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని 21 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. శుక్రవారం పిటీషన్‌ను పరిశీలించిన సుప్రింకోర్టు న్యాయమూర్తి విచారణ చేస్తామని తెలిపారు. కాగా ఈ అంశంపై త్వరగా విచారణ జరపాలని ప్రతిపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరగనుంది. ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈవీఎంల ద్వారా అవకతవకలు జరుగుతున్నాయని, ఒకపార్టీకి ఓటేస్తే ఒక పార్టీ వెళ్తుందని గతకొంతకాలంగా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ అంశంపై దేశంలోని 21 పార్టీలు కలిసి సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. వీవీ ప్యాట్ల లెక్కింపు ఈసీని నివేదిక కోరింది. వీవీప్యాట్లలో 50శాతం స్లిప్పులు లెక్కించడం వల్ల సమయం, సిబ్బంది ఎక్కువ అవసరమవుతారని, దీనివల్ల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతిపక్షాలకు ఊరట కలిగించేలా 5 వీవీప్యాట్‌లను లెక్కించాలని సుప్రిం తీర్పునిచ్చింది. దీనిపై ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. ఈసీ సుప్రింకోర్టును తప్పుదోవ పట్టిస్తుందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 50శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కింపు చేపట్టినా ఒక్కరోజులోనే కౌంటింగ్‌ పూర్తవుతుందని, కానీ ఈసీ మాత్రం ఆరు రోజులు పడుతుందని అనడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో 50శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాల్సందేనని కోరుతూ దేశంలోని 21ప్రతిపక్ష పార్టీలు సుప్రింకోర్టులో రివ్యూ పిటీషన్‌ దాఖలు చేశారు. కాగా శుక్రవారం ఈ రివ్యూపిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రింకోర్టు.. వచ్చే వారం విచారణ చేపడతామని పేర్కొంది.