ప్రధాని మోడీకి చిదంబరం చురకలు

కాంగ్రెసె అధ్యక్షుల జాబితా వెల్లడి

రఫెల్‌ కుంభకోణంపై ప్రధాని దృష్టిసారించాలని హితవు

న్యూఢిల్లీ,నవంబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ వారసత్వాన్ని టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ పార్టీ గట్టి సవాల్‌ విసిరింది. విూకు ప్రజాస్వామ్యం విూద గౌరవం ఉంటే.. నెహ్రూ వల్లే ఒక చాయ్‌వాలా ప్రధాని అయ్యాడని విూరు భావిస్తే.. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తికి ఇవ్వండటూ ఛత్తీస్‌ఘడ్‌ ఎన్నికల సభలో సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో చిదంబరం వరుస ట్వీట్లతో మోదీపై విరుచుకుపడ్డారు. స్వాతంత్యాన్రికి పూర్వం నుంచి ఇప్పటిదాకా పార్టీ వారసత్వ జాబితా విప్పారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, కె. కామరాజ్‌, మన్మోహన్‌ సింగ్‌ సహా ఎంతోమంది ప్రముఖులు కాంగ్రెస్‌కు సారధ్యం వహించడం తమకు గర్వకారణమన్నారు. అలాంటి పార్టీ మూలాలను స్వాతంత్యాన్రంతరం కూడా వేలామంది సజీవంగా కాపాడుతూ వచ్చారని చిదంబరం పేర్కొన్నారు. 1947 నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ఆచార్య కృపలానీ, పట్టాభి సీతారామయ్య, పురుషోత్తమ్‌ దాస్‌ టాండన్‌, యూఎన్‌ ధెబార్‌, సంజీవ రెడ్డి, సంజీవయ్య, కామరాజ్‌, నిజలింగప్ప, సి. సుబ్రహ్మణ్యన్‌, జగ్జీవన్‌ రామ్‌, శంకర్‌ దయాళ్‌ శర్మ, డీకే బారూ, బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, సీతారాం కేసరి….అంటూ వరుసగా కాంగ్రెస్‌ రథసారధుల జాబితా వెల్లడించారు. కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఎవరెవరు పనిచేశారన్న ‘ఆందోళన’ ప్రధాని మోదీకి ఉన్నందుకు, దీనిపై ఆయన ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నానంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇందులో సగం సమయం తన హయాంలో జరిగిన రాఫెల్‌ ఒప్పందం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలపై ప్రధాని మాట్లాడితే బాగుంటుందని చురకలు వేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఎవరెవరు పనిచేశారో అనే దానిపై విస్తృత సమయం కేటాయిస్తున్న మోదీ.. అందులో సగం సమయం నోట్లరద్దు, జీఎస్టీ, రాఫెల్‌, సీబీఐ, ఆర్బీఐ గురించి మాట్లాడగలరా? రైతుల ఆత్మహత్యలు, తీవ్ర నిరుద్యోగం, మూకహత్యలు, మహిళలు- చిన్నారులపై లైంగికదాడులు, యాంటీ- రోమియో మూకలు, గో రక్షక దళాలు సహా పెచ్చరిల్లుతున్న తీవ్రవాద దాడులపై ప్రధాని నోరు విప్పగలరా?’ అని చిదంబరం నిలదీశారు.