ప్రధాని మోదీ నమ్మక ద్రోహి

– నమ్మించి ఏపీ ప్రజలను మోసం చేశాడు
– ఎన్డీయే నుంచి బయటకురాగానే తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టాడు
– మహాకూటమి ఏర్పాటు చేసినందుకే కేసీఆర్‌ నాపై విమర్శలు
– అధికారంలో ఉన్నాం కదాని విర్రవీగకూడదు
– జగన్‌, పవన్‌.. మోదీ చెప్పినట్లు వింటున్నారు
– పవన్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ ఏమైంది?
– తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ తెదేపా ఉంటుంది
– వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఆర్థికసాయం చేయాలి
– రాష్ట్ర ప్రయోజనాలకోసమే ధర్మపోరాటం చేస్తున్నా
– అనంతపురాన్ని పారిశ్రామిక హబ్‌గా తయారు చేస్తాం
– జిల్లాలో కరువును తరిమేందుకు ప్రత్యేక చర్యలు
– అనంతపురం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అనంతపురం, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీ నమ్మక ద్రోహి అని, నమ్మించి ఏపీ ప్రజలను మోసం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు.  ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో గుమ్మఘట్ట మండలానికి చేరుకున్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి బీటీ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్‌ ఆవిష్కరించారు. ఆ తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష నీటి కుంటలు జిల్లాలో పూర్తయిన సందర్భంగా లక్ష నీటి కుంటను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాను కరవు నుంచి దూరం చేసేందుకు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే లక్ష నీటి కుంటలు పూర్తి చేయడం, 5లక్షల ఎకరాలకు బిందు, తుంపర సేద్య పరికరాలు అందించామని
చెప్పారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని తాము ఎంతో కృషి చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలోని హావిూలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని నిలదీసే తాము ఎన్డీయే నుంచి వైదొలిగామని… అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వెనుకబడిన 7జిల్లాల్లో అభివృద్ధి నిమిత్తం విడుదల చేసిన నిధులనుసైతం కేంద్రం వెనక్కి తీసుకుందని.. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు కేసుల నుంచి బయటపడటంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదని చంద్రబాబు విమర్శించారు. ఎవరు అధికారంలో ఉంటే వారికాళ్లు పట్టుకోవడం వారికి అలవాటేనన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని, కేంద్రాన్ని విమర్శించడం మానేసి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మోదీ పేరెత్తితేనే వైకాపా నేతలకు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ఉపఎన్నికలు రాకుండా అన్నీఆలోచించిన తర్వాతే వైకాపా ఎంపీలు రాజీనామా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రెండు మూడు పార్టీలకు అభివృద్ధిని అడ్డుకోవడమే అలవాటుగా మారిందన్నారు. గత ఎన్నికల్లో తమకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు మోదీ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని ఆరోపించారు. జనసేన ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ వేసిన పవన్‌.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాలని తేల్చారని.. కానీ అప్పుడు ఆ నివేదిక ఊసే ఎత్తడం లేదన్నారు. రాజకీయాల్లో విలువలు, పద్ధతి ఉండాలని.. అధికారం ఉంది కదాని తప్పుడు పనులు చేయడం సరికాదన్నారు. తాము భాజపాతో విభేదించక ముందు ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలని, విభజన హావిూలు నెరవేర్చాలని తెరాస నేతలు కూడా డిమాండ్‌ చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. ఎప్పుడైతే తెదేపా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందో అక్కడి నుంచి భాజపా నేతలు రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మోదీ కంటే సీనియర్‌ రాజకీయ నేతని అయిన తనను పట్టుకుని మెచ్యురిటీ లేదని ఆయన పార్లమెంటులో మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఓ దశలో భాజపా దేశవ్యాప్తంగా రెండు సీట్లకే పరిమితమైన సమయంలో.. ఎన్టీఆర్‌ హయాంలోని తెదేపా 35 సీట్లతో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిందని.. తమ పార్టీ సత్తా అలాంటిదని గుర్తుచేశారు. ప్రపంచంలో తెలుగుజాతి ఎక్కడున్నా తెదేపా ఆదుకుంటుందన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మహాకూటమిలో చేరినందుకే కేసీఆర్‌ తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని నిలదీస్తే దాడులు చేసే పరిస్థితికొచ్చారని మండిపడ్డారు. మోదీ మోసాన్ని చూసే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పదవులకు రాజీనామా చేసి ప్రజల తరపున పోరాడుతున్నామని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఆర్థికసాయం చేయాలన్నారు. కేంద్రం.. ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన డబ్బులను చట్ట వ్యతిరేకంగా మళ్లీ వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఏపీకి అన్యాయం చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. నాకు మెచ్యూరిటీ లేదని.. తెలంగాణ సీఎంకు మెచ్యూరిటీ ఉందని మోదీ అన్నారని గుర్తు చేశారు.  టీడీపీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ అని, ఎవరికి ఇబ్బంది ఉన్నా అందరినీ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతపురం కరువు జిల్లా నుంచి ఆస్తుల జిల్లాగా మారుతుందన్నారు. బీటీ ప్రాజెక్టు జనవరిలోగా పూర్తి చేసి నీళ్లిస్తామన్నారు. 2022 నాటికి లక్ష ఎకరాలకు నీరందించే విధంగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. లక్ష పంట కుంటలు తవ్విన ఏకైక ఘనత అనంతపురం జిల్లాకే దక్కిందన్నారు. అనంతపురం పారిశ్రామిక హబ్‌గా తయారవుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమలంలో స్థానిక తెదేపా నేతలు పాల్గొన్నారు.

తాజావార్తలు