ప్రధాన పార్టీలన్నింటిల్లోనూ వారసత్వమే అన్న
కుటుంబాల్లోనూ రంగంలో అభ్యర్థులు
తెరపైకి విమర్శలు..లోలోన సర్దుబాట్లు
హైదరాబాద్,సెప్టెంబర్15(జనంసాక్షి): వారసత్వాల గురించి విమర్శలు చేస్తున్న వారే తమ వారసులను తెరపైకి తెస్తున్నారు. టిఆర్‌ఎస్ కుటుంబ పాలన అంటున్న వారు కూడా వారి కుటుంబాలను నేరుగా దింపుతున్నారు. కాంగ్రెస్ వారసత్వాన్ని విమర్శిస్తున్న వారు కూడా తమ వారసులను దింపుతున్నారు. అన్నదమ్ములు.. తండ్రి, కొడుకులు, బాబాయ్ అబ్బాయ్.. ఇలా ఎవరికి వారు టికెట్ల కోసంఅధిష్టానాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రతి పార్టీ వారసత్వరాజకీయాలకే మొగ్గు చూపుతోంది. అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపులో పలుకుబడి గల రాజకీయకుటుంబాలకు అగ్రతాంబూలం ఇస్తున్నాయి. వారసత్వ పాలన కొత్తేవిూ కాకున్నా ఇటీవలి కాలంలో జోరందుకున్నాయి. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ గజ్వెల్ నుంచి కుమారుడు మంత్రి కెటిఆర్ సిరిసిల్ల నుంచి, తనయ కవిత మరోమారు ఎంపిగా నిజమాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే అల్లుడు హరీష్ రావు సిద్దిపేట నుంచి బరిలో ఉండనున్నారు. దూరపు బంధువులు ఎంపిగా ఉన్న వినోద్ మారోమారు కరీంనగర్ నుంచి ఎంపిగా, కోరుట్ల నుంచి విద్యాసాగర్ రావు మరోము ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌లో ఉత్తమ్ ఆయన భార్య ఇద్దరూ ప్రస్తుతం పోటీలోఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా పోటీ చేయనున్నారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మరోసారి పార్టీలో తన ప్రాబల్యాన్ని చాటుకున్నారు. ఈసారి ఎన్నికల్లో సోదరుడు నరేందర్‌రెడ్డికి కొడంగల్ టికెట్టును దక్కించుకున్నారు. ఆయన రేవంత్‌రెడ్డిపై పోటీ చేయబోతున్నారు. సతీమణి సునీతను జిల్లాపరిషత్ చైర్‌పర్సన్‌గా.. నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించిన మహేందర్.. తాజాగా నరేందర్‌కు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారు చేయించుకోవడంలో కీలక భూమిక పోషించారు. కొడంగల్‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి అధికార పార్టీకి కొరకరానికొయ్యగా మారిన నేపథ్యంలో ఆయన ఓటమే లక్ష్యంగా
నరేందర్‌ను టీఆర్‌ఎస్ అధిష్టానం బరిలో దించింది. అదేసమయంలో గెలిపించే బాధ్యతను మహేందర్‌రెడ్డిపై పెట్టింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి ఈసారి శాసనసభ బరిలో దిగాలని నిర్ణయించారు. మహేశ్వరం నుంచి తల్లి, రాజేంద్రనగర్ నుంచి పుత్రుడు పోటీ చేసే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో పోటీచేయాలని భావించిన సబితకు కుమారుడి రూపంలో చుక్కెదురైంది. కుటుంబానికి ఒకే సీటుఇవ్వాలనే ఏఐసీసీ ఆంక్షల నేపథ్యంలో చేవెళ్ల ఎంపీగా కార్తీక్ రాజకీయ అరంగేట్రానికి తలూపిన సబిత.. శాసనసభ సీటును త్యాగం చేశారు. ఈసారి మాత్రం ఇరువురు పోటీచేయడానికే మొగ్గు చూపుతున్నారు. టీడీపీ సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ కుటుంబం కూడా రెండు టికెట్లను ఆశిస్తోంది. దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్ ఉప్పల్ నుంచి పోటీచేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. కాంగ్రెస్‌తో దాదాపుగా పొత్తు కుదురుతుందని భావిస్తున్న తరుణంలో ఆయన పోటీ తథ్యంగా కనిపిస్తోంది. దేవేందర్‌గౌడ్ మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్‌కు పోటీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున సబిత బరిలో దిగుతున్నందున ఆయన పోటీ.. సీట్ల సర్దుబాటుపై ఆధారపడి ఉంది. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్న జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ తన సొదరుడి కుమారుడు వీరేశ్‌ను కుత్బుల్లాపూర్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై ఇటీవల అమరావతి వెళ్లిన ఆయన అక్కడ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో కూడా చర్చలు జరిపారు. పొత్తు పొడిస్తే టీడీపీ ఈ సీటును కోరే అవకాశం ఉంది. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి మరోసారి సనత్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కుమారుడు ఆదిత్య మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడి
తెలంగాణ జనసమితి (టీజేఎస్)లో చేరారు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ సీటును ఆశించి భంగపడ్డ ఆదిత్య ఈ సారి తప్పనిసరిగా శాసనసభకు పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. తాండూరు నుంచి బరిలో దిగే అంశాన్ని పరిశీలిస్తున్నారు. టీజేఎస్ మహాకూటమిలో భాగస్వామిగా మారడం.. ఈ స్థానం నుంచి తన తాత, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రాతినిథ్యం వహించినందున తాండూరును ఎంచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి తన కుమారుడు మహేశ్‌రెడ్డి కోసం ఈసారి పొటీ నుంచి తప్పుకున్నారు. వయోభారం, ఆనారోగ్యం కారణంగా పుత్రుడు మహేశ్‌కు టీఆర్‌ఎస్ సీటు ఇప్పించుకోగలిగారు. మరోవైపు మల్‌రెడ్డి సోదరులు మరోసారి టికెట్ల వేట సాగిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఇబ్రహీంపట్నంతో పాటు ఎల్‌బీనగర్ లేదా మహేశ్వరం నుంచి పోటీచేసేందుకు హస్తినలో లాబీయింగ్ నెరుపుతున్నారు. ఇకపోతే వరంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కొండా సురేఖ కుటుంబం మొత్తం బరిలోకి దిగబోతున్నది. సురేఖ, ఆమె కూతురు, భర్త మురళి కూడా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేశారు.