ప్రభుత్వాన్ని కూల్చేందుకు.. బీజేపీ కుట్రలు చేస్తుంది


– మా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు
– ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కనిపించడం లేదు
– మోదీ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడు
– అవసరమైతే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమే
– కర్ణాటక సీఎం కుమారస్వామి
– బీజేపీ ప్రలోభాల ఆడియో క్లిప్పింగ్‌లను విడుదల చేసిన కుమారస్వామి
బెంగళూరు, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విధాన సౌధలో విలేకరుల సమావేశంలో మాట్లాడియన ఆయన బీజేపీ తీరుపై మండిపడ్డారు. డబ్బు, పదవులు ఎరవేసి తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేస్తున్నారని.. దేశానికి రక్షకుడిగా చెప్పుకుంటున్న మోడీ.. అవినీతిని ప్రొత్సహిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప.. జేడీఎస్‌ ఎమ్మెల్యే నాగన్న గౌడకు డబ్బు ఎరవేశారని కుమారస్వామి ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ ఆడియో టేపునుసైతం విడుదల చేశారు. నాగన్న గౌడ కుమారుడు శరణకు యడ్యూరప్ప ఫోన్‌ చేసి తమకు మద్దతిస్తే రూ.లక్షల్లో డబ్బు.. మంత్రి పదవి ఇస్తామని ఆఫర్‌ చేశారన్నారు. దీనిపై ఆధారాలతో సహా రుజువు చేస్తానన్నారు. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కనబడట్లేదని సీఎం పేర్కొన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఒక వైపు మాత్రం ప్రధాని మోదీ సత్యాలు వల్లెవేస్తున్నారని, మరోవైపు సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కుమారస్వామి మండిపడ్డారు. బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే బల నిరూపణకు సిద్ధమన్నారు. కర్ణాటకలో గత ఏడాది కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో తొలుత అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. గవర్నర్‌ అవకాశమివ్వడంతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే శాసనసభలో ఆయన బలనిరూపణ చేసుకోలేకపోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆపరేషన్‌ కమల పేరుతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను భాజపా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని చాలా రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి శుక్రవారం విూడియా సమావేశం నిర్వహించి ఆడియో టేపును విడుదల చేశారు.
మోదీ దేశంలోని వ్యవస్థలను కూల్చేస్తున్నారు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారంటూ దుయ్యబట్టారు.  ‘ప్రధామంత్రి నరేంద్రమోదీ పార్లమెంటు మెట్లకు శిరస్సు వంచి నమస్కరించిన దృశ్యం నాకు ఇంకా
గుర్తుందని, నిన్న లోక్‌సభలో ఆయన మాట్లాడిన మాటలు కూడా నేను గమనించానన్నారు. అవినీతి గురించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారని, నేను రాష్ట్రంలో అమలు చేస్తున్న రుణమాఫీలపై సైతం దాడికి దిగారన్నారు. ఓవైపు ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవాలయం అంటూనే… మరోవైపు అదే వేదికగా ఆయన అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. ప్రధాని తన ప్రసంగం ఆసాంతం ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నించారని కుమారస్వామి ఆరోపించారు. మెల్లమెల్లగా దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కూలదోసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టాలని ప్రతిపక్షాలను కోరుతున్నానని, చాలా బాధతో ఈ విషయం చెబుతున్నానని అన్నారు.  మోదీ ఓవైపు దేశాన్ని కాపాడడమే తన ధ్యేయం అంటారని, కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాత్రం గవర్నర్‌నుసైతం మాట్లాడకుండా అడ్డుకుంటుందన్నారు. ఒకవేళ ప్రభుత్వం బలహీనంగా ఉందని బీజేపీ భావిస్తే.. అవిశ్వాసం పెట్టేందుకు ఆపార్టీ ఎందుకు సందేహిస్తోందని.. వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలను ఎందుకు అడ్డుకుంటోందని సీఎం ప్రశ్నించారు. 2006లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా కేవలం రెండు నెలల్లో తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని బీజేపీ ప్రయత్నించిందని కుమార స్వామి ఆరోపించారు. తనపై అవినీతి ఆరోపణలు చేసి పదవి నుంచి దించేందుకు ప్రయత్నించారనీ.. ఆ పరిణామాలను తాను ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. ‘బడ్జెట్‌ ప్రవేశపెట్టడడం అంటే పిల్లకాయల ఆటకాదని, కానీ బీజేపీ కావాలని సమస్యలు సృష్టిస్తోందని అన్నారు. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయని, ఏప్రిల్‌లో ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం కావాల్సిఉందని, ఇలాంటి సమయంలో బీఎస్‌ ఎడ్యూరప్ప రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని కుమారస్వామి ప్రశ్నించారు.