ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ల ఎస్సీ, ఎస్టీలకు కోటా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయించిన బిల్లుకు మంగళవారం నాడు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీ ఆమోదానికి పంపించింది. ఇదిలా ఉండగా ఈ బిల్లుపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఈ బిల్లును స్వాగతించారు. ప్రభుత్వ రంగంలో ఉన్నత ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ గత ఉత్తరప్రదేవ్ ముఖ్యమంత్రి మాయావతి సంకల్పించిన దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ బిల్లుకు రాజ్యాంగ బద్ధత కల్పించేందుకు కేబినెట్ చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది. దీనిపై మాయావతి మాట్లాడుతూ అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్ధతు ఇవ్వాలని కోరారు. గత ఆగస్టులో ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ బిల్లు ఆమోదానికి గాను అఖిల పక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేయగా ఇందులో పాల్గొన్న ములాయం సింగ్ యాదవ్ ఈ బిల్లు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒబిసీలకు కూడా ఈ బిల్లులో కోటా కల్పించాల్సిన అవసరం ఉందని, అలా కల్పిస్తేనే తామ మద్ధతు ఇస్తామని తెలియజేసిన విషయం తెలిసిందే.