ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో వీఆర్ఏ తో కలిసి మద్యం తాగుతూ మీడియాకు దొరికిన ఎల్లారెడ్డి తహసీల్దార్ సుధాకర్
బాధ్యతలు చేపట్టిన రెండో రోజే వెలుగు చూసిన ఘటన
ఎల్లారెడ్డి ఆగస్టు 12 ( జనంసాక్షి ) అది ప్రభుత్వ గెస్ట్ హౌస్. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైనా ఆయా కార్యక్రమాల నిమిత్తం వచ్చినప్పుడు కాసేపు విరామం తీసుకునే అతిథి గృహం. కానీ అందులో తాహసిల్దార్ విఆర్ఎ తో కలిసి మద్యం తాగుతూ మీడియాకు పట్టుబడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఓవైపు భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా అన్ని శాఖల ప్రభుత్వాధికారులు తమ తమ పనుల్లో బిజీగా ఉంటే ఈ తాహసిల్దార్ మాత్రం బాధ్యతలు చేపట్టిన రెండో రోజే మద్యం తాగుతూ దొరికిపోవడం చర్చనీయాంశమైంది.
ఇక వివరాల్లోకి వెళితే….
ఎల్లారెడ్డి మండల కేంద్రంలో తహసీల్దారుగా పనిచేసే మునిరుద్దీన్ గత రెండు రోజుల క్రితం బదిలీపై వెళ్ళాడు. ఈయన స్థానంలో నాగర్ కర్నూల్ నుండి వచ్చిన తహసిల్దార్ సుధాకర్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించాడు. తర్వాతి రోజైన గురువారం రాత్రి సమ్మెలో ఉన్న వీఆర్ఏ తో కలిసి తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ లో మద్యం సేవిస్తూ మీడియా ప్రతినిధులకు దొరికిపోయాడు. దీంతో ఆయన్ను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. తాను రెండు రోజుల క్రితం తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించానని, తనకు అద్దె ఇల్లు దొరకకపోవడం వల్లే గెస్ట్ హౌస్ లో ఉన్నానని ఆయన తెలిపాడు. అయితే ప్రభుత్వ బంగ్లాలో మద్యం తాగడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. ఇదిలా ఉండగా సమ్మెలో ఉన్న వీఆర్ఏ చేత మద్యం తెప్పించుకుని తాగిన సంఘటన వెలుగు చూడడంతో పట్టణంలో అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.