ప్రభుత్వ పథకాల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక

విశాఖపట్నం: రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ కులాల ప్రజానీకం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల పనితీరును క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్ల్టు శాసనసభ ఎస్సీ కమిటీ ఛైర్మన్‌ లబ్బి వెంకటస్వామి అన్నారు. మొత్తం 52 శాఖల ద్వారా ప్రభుత్వం ఎస్సీల కోసం అమలు చేస్తున్న పథకాలు ఆయా వర్గాలకు ఎంతవరకు అందుతున్నాయో తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటన చేస్తున్నట్లు అయన తెలిపారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, పదోన్నతులు, సంక్షేమానికి సంబంధించి విశాఖ జిల్లాకు చెందిన ప్రజా సంఘాలు, మేధావులు తదితర ప్రతినిధుల నుంచి కమిటీ వినతి పత్రాలను స్వీకరించింది. కమిటీ సింహాచలంలో ఎస్సీలకు అందుతున్న సంకక్షేమ పథకాలు, వివక్షకు సంబంధించి వివరాలను సేకరించింది. కార్యక్రమంలో కమిటీ సభ్యుడు హనుమంత్‌ షిండే, ఎమ్మెల్యే పంచర్ల రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.