“ప్రభుత్వ విద్యను బతికించుకుందాం – బిజెపి నేత గజ్జల యోగానంద్”
మాదాపూర్, సెప్టెంబర్ 20( జనంసాక్షి): రాష్ట్రంలో రోజు రోజుకి విద్యా వ్యవస్థ బ్రష్టు పట్టిపోతుందని, తెరాస పాలనలో విద్యా విధానం అంగడి సరుకుగా మారిందని దానిని బతికించుకోవాల్సిన అవసరం ప్రతి తెలంగాణ బిడ్డపైన ఉందని భాజపా సీనియర్నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇన్చార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టం చేశారు. ఈమేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ గోకుల్ ఫ్లాట్స్, చందా నాయక్ తండా, అంబేద్కర్ నగర్ పరిధిలోగల ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం బిజెపి నాయకులు, కాలనీవాసులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలనుగూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నానాటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు ఆదరణ కరువవుతుందని సమస్యలు ఎక్కడికక్కడ పెరుగుతున్నాయన్నారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ చూసినా వసతులకొరత, ఉపాధ్యాయుల కొరత, భవనాల కొరత కనిపిస్తుందితప్ప ఏరోజు ఏ ఒక్క పాఠశాల నిబంధనల ప్రకారం కొనసాగుతున్న దాఖలాలు లేవని ఆయన ఆరోపించారు. విద్యా విభాగం ఉన్నతస్థాయి అధికారులనుండి సరైన పర్యవేక్షణ లేకపోవడంవల్ల ప్రభుత్వ విద్యకు సుస్తిచేసి సర్కారు బడులన్నీ నిర్జీవంగా తయారవుతున్నాయని యోగానంద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెరాస పాలనావ్యవస్థలో ప్రభుత్వ విద్యకు ఎంతటి దుస్థితి చేకూరిందో చెప్పలేమని, ఇలాగే ఇంకొంత కాలం విద్యా వ్యవస్థ కొనసాగితే తెలంగాణ రాష్ట్రంనుండి ప్రభుత్వ విద్య కనుమరుగయ్యే అవకాశం ఉందని గజ్జల ఆందోళన వ్యక్తంచేశారు. శేరిలింగంపల్లి పరిధిలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న దుస్థితినిచూసి ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేయడంతోపాటు ప్రభుత్వ విద్యను ముంచడానికి కెసిఆర్ సర్కారు కంకణం కట్టుకుందని, ఇకనైనా ప్రజలు, విపక్షాలు, ఉపాధ్యాయ, ఉద్యోగులంతా ఏకమై ప్రభుత్వంపై పోరాటంచేస్తే తప్ప పరిస్థితులు బాగుపడే రోజులు లేవని గజ్జల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, రమేష్ సోమిశెట్టి, హరికృష్ణ, వినయ్ బాబు, కురుమ శ్రీశైలం, హరిప్రియ, కైతాపురం జితేందర్, రమేష్ రెడ్డి, చక్రాలగంగాధర్, రోజారమణి, స్వర్ణ శ్రీశైలం, శివ కుమార్ వర్మ, శోభా దూబె, వెంకటేశ్వరరావు, దేవేందర్, రాజేష్, సాయి తదితరులు పాల్గొన్నారు..
Attachments area