ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత
రంగస్థలం నుండి వెండితెరకి వచ్చి ఆ తర్వాత బుల్లితెరపై కూడా నటించి ఎందరో మనసులు గెలుచుకున్న వైజాగ్ ప్రసాద్(75) ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఈ రోజు ఉదయం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు . వైజాగ్ ప్రసాద్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతి సినీ పరిశ్రమకి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు, అభిమానులు.
వైజాగ్ ప్రసాద్ దాదాపు 170కి పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 1983 లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ నటుడిగా ఆయన మొదటి సినిమా. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాలో కథానాయకుడి తండ్రిగా నటించి పలు ఆఫర్స్ పొందారు. భద్ర, జై చిరంజీవ, నీరాజనం, జెమని,అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణీగారి బంగ్లా, ఇది మా ప్రేమ కథ వంటి సినిమాలలో కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. విశాఖపట్నం లోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. వైజాగ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పేరు వైజాగ్ ప్రసాద్ గా స్థిరపడిపోయింది. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిల తర్వాత నాలుగో సంతానంగా జన్మించాడీయన. ఈయనకు ఒక చెల్లెలు కూడా ఉంది.
తనకి ఊహా తెలియక ముందే తల్లి కన్నుమూయడంతో మేనమామ దగ్గరుండి ఎస్. ఎస్. ఎల్. సి దాకా చదువుకున్నాడు. చదువుకునే రోజుల్నుంచే నాటకాల్లో నటించేవాడు. నాటకాల పిచ్చితో అగ్రికల్చర్ బి. ఎస్. సి లో సీటు, ఎం. బి. బి. ఎస్ సీటు పోగొట్టుకున్నాడు. తర్వాత బి. ఎ. చదివాడు. ఆయన భార్య పేరు విద్యావతి. వీరి దంపతులకి రత్నప్రభ, రత్నకుమార్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ కంప్యూటర్ ఇంజనీర్లు. అమ్మాయి అమెరికాలో నివాసం ఉండగా అబ్బాయి లండన్ లో ఉంటున్నాడు.