ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు కన్నుమూత

చెన్నయ్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): ప్రముఖ హాస్య, క్యారెక్టర్‌ నటుడు సుత్తివేలు ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితమే ఆయన చెన్నయ్‌కు చేరుకుని చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య లక్ష్మీరాజ్యం, ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం. సుత్తివేలు’ అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీనరసింహరావు. 1947, ఆగస్టు 7వ తేదీన కృష్ణాజిల్లాలో జన్మించారు. ఆయన తన ఏడో యేటనే రంగస్థలంపై కాలుమోపారు. అనేక ప్రదర్శనలు ఇచ్చారు. నావల్‌ డాక్‌ యార్డులో ఉద్యోగం చేస్తూనే అనేక నాటకాలు ప్రదర్శించారు. 1980లో ముద్దమందారంతో సినీరంగ ప్రవేశం చేశారు. సుత్తివేలులోని టాలెంట్‌ను గుర్తించిన ప్రముఖ దర్శకుడు జంధ్యాల ఆయన్ను ఎంతో ప్రోత్సహించారు. వీరభద్రరావుతో కలిసి అనేక హాస్య పాత్రలను పోషించారు. వారిద్దరు సుత్తి జంటగా ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసుకున్నారు. నాలుగు స్తంభాలాట సినిమాలో ఆయన పాత్ర తెలుగు ప్రేక్షకులకు మరింత సన్నిహితుడ్ని చేశాయి. ఆయన సుమారుగా 200 కు పైగా సినిమాల్లో నటించారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ నటుడిగా, విలన్‌గా ఎన్నో పాత్రలు ధరించి ప్రజల మన్ననలు పొందారు. అనేక టీవీ సీరియళ్లలోను నటించారు. ఆనందోబ్రహ్మలో అద్భుతమైన పాత్ర ధరించి బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు. వందేమాతరంలోని నటనకుగాను ఆయనకు నంది అవార్డు వరించింది. ప్రతిఘటన సినిమాలో అద్భుతమైన పాత్ర ధరించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఒసేయ్‌.. రాములమ్మలోని తండ్రి పాత్రకు ఆయన జీవం పోసి.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయేలా ఆ పాత్రలో జీవించారు. నాలుగు స్తంభాలాట, ఆనందభైరవి, రేపటి పౌరులు, దేవాలయం, కలికాలం, రెండు రెళ్లు ఆరు, జయమ్ము నిశ్చయమ్మురా.., చంటబ్బాయ్‌, ఖైదీ, శ్రీవారికి ప్రేమలేఖ, మరణ మృదంగం, అప్పుల అప్పారావు, కలికాలం, రక్త సింధూరం, శ్రీనివాస కళ్యాణం, పవిత్రబంధం, భారతనారి, కిల్లర్‌, ఆదిత్య 369.. ఇలా అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన తొలి చిత్రం ముద్దమందారం కాగా.. చివరి చిత్రం శశిరేఖా పరిణయం. ఆయన మృతి పట్ల తెలుగు, తమిళ సినీరంగ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వంశీ, కృష్ణవంశీ, తణికెళ్ల భరణి, చంద్రమోహన్‌, మురళీమోహన్‌, శ్రీలక్ష్మి, అనంత్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, సునీల్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, తదితరులు శ్రద్ధాంజలి తెలిపిన వారిలో ఉన్నారు.