ప్రాజెక్టులపై ఇంకా విమర్శలు తగవు: విప్‌

యాదాద్రి భువనగిరి,జూలై30(జ‌నం సాక్షి): కృష్ణా, గోదావరి జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి ముమ్మాటికీ అపరభగీరథుడని ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాల పూర్తితో తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని నిరూపించామన్నారు. ప్రభుత్వం ఏదైనా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సాంకేతికపరమైన, అటవీ, పర్యావరణ, భూసేకరణ వంటి సమస్యలు ఉత్పన్నం అయితే ఇరిగేషన్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ప్రభుత్వంతోపాటు ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్భందులను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. రైతులతో నేరుగా సంప్రదించి, వారి ఇష్టానుసారమే భూములను సేకరించటం ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. రైతులే ముందుకు వచ్చి భూములు ఇస్తున్నా, పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఎకరాకు కూడా సాగునీరు అందించలేని వారు, మరికొన్ని విపక్ష పార్టీల నాయకులు ధర్నాలు, యాత్రలతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.4500 కోట్లతో మిషన్‌భగీరథ, రూ.1000 కోట్లతో ఇంటింటికి నల్లాను ఏర్పాటు చేసి గోదావరి జలాలను ప్రభుత్వం అందించనుందన్నారు. గత ప్రభుత్వాలు కవిూషన్ల కోసమే ప్రాజెక్టులను చేపట్టి ప్రజలను మోసం చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో చేపట్టబోతున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టులు భవిష్యత్‌ తరాలకు దారిచూపడం ఖాయమన్నారు.