ప్రియాంక రాకతో బిజెపిలో అసహనం

శూర్పణఖ అంటూ అసభ్య విమర్శలు

3జీ అంటూ అమితషా ఎద్దేవా

న్యూఢిల్లీ,జనవరి31(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ప్రియాంకా వాధ్రాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవడంతో బిజెపిలో అలికిడి మొదలయ్యింది. అలజడి రేగుతోంది. అందుకే ఉచ్చనీచాలు మరచి విమర్శలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ బిజెపి నేతలు ఇంతగా విమర్శలకు దిగిన దాఖలాలు లేవు. పార్టీ అధక్షుడు అమిత్‌ షా అయితే 2జీ, 3జీ అయ్యిందన్నారు. వాజ్‌పేయ్‌,అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, వెంకయ్య నాయుడు, చివరకు గడ్కరీల చేతిలో పార్టీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యక్తిగత అసంబద్ద విమర్వలకు బిజెపి ఎప్పుడూ పూనుకోలేదు. ప్రియాంకను శూర్పణఖ అంటూ..రాహుల్‌ను రావణుడితో పోలుస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే బిజెపి ద్వయం మెప్పుకోసం తప్ప మరోటి కాదు. మోడీని అడ్డుకునేందుకు….ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పట్టుకునేందుకు..విపక్షాలు ఏకం అయ్యాయి. చివరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రియాంకను రంగంలోకి దింపింది. ఆమెను శూర్పణఖ అన్నా.. మరేదన్నా, ప్రియాంక రాక కాంగ్రెస్‌కు జవసత్వాలను ఇస్తుందనన్న నమమకం బిజెపిలో కూడా ఏర్పడిందనడంలో సందేహం లేదు. నరేంద్ర మోదీ తిరిగి అధికారానికి రాకుండా అడ్డుకోవడం అవసరమని దేశంలోని మెజారిటీ ప్రతిపక్షాలు భావిస్తున్న నేపథ్యంలో ప్రియాంకాగాంధీని దింపాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏర్పడింది. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించినప్పటికీ మొత్తం సార్వత్రక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకోగలదన్న విశ్వాసం ఇంకా ఆ పార్టీ శ్రేణుల్లో ఏర్పడలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో బిజెపి పై వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు. దీంతో చేయి కాల్చుకో గూడదన్న భావనతో సోనియా పాచిక వేసిందనే చెప్పాలి. సోనియాగాంధీ తనయ తప్పనిసరి ప్రయోగం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో 33, ఉత్తర ప్రదేశ్‌లో 21 సీట్లు పొందినందువల్లే 206 లోక్‌సభ సీట్లను సాధించుకోగలిగింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఎలాగూ పుంజుకునే అవకాశాలు లేవు. ఈ రెండు రాష్ట్రాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీటయినా వస్తుందన్న నమ్మకం లేదు. కర్నాటకలో కొంత ప్రభావం ఉండవచ్చు. దీంతో అతిపెద్దయిన యుపిలోనైనా కొన్ని సీట్లు సాధించాలన్న పట్టుదలతో ఉన్న రాహుల్‌ రాజకయీంగా ఆలోచన చేసి ప్రియాంక గాంధీని తీసుకుని వచ్చారనే భావించాలి. ఆమె రాకతో నిజంగానే నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌లో ఉత్తేజం వచ్చింది. నిజానికి కాంగ్రెస్‌లో ఇప్పటికి చాలా మంది ప్రధాన కార్యదర్శులను నియమించినప్పుడు రాని కదలిక ప్రియాంకాగాంధీని ప్రధానకార్యదర్శిగా నియమించినప్పుడు ఏర్పడింది. బహుశా రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్షుడైనప్పుడు కూడా పత్రికలు ఇంత పెద్ద ఎత్తున స్పందించలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రియాంకా గాంధీకి ఉన్న ఆకర్షణ ఇందుకు ఒక కారణమైతే దేశంలో మోదీని గట్టిగా ఢీకొనగలగిన ఆకర్షణ గల నేతకోసం జనం ఎదురు చూడడం మరో కారణం కావచ్చు. దేశంలో ప్రతిపక్షంలో నాయకత్వ శూన్యం ఉండడమే ప్రియాంకకు ఇంత ప్రచారం రావడానికి కారణమైంది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రియాంక నిజంగా పార్టీ బాధ్యతలు చేపట్టి పర్యటనలు ప్రారంభించిన తర్వాత, మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత రాజకీయ వాతావరణంలో మార్పు ఉంటుందన్న విషయం తేలుతుంది. అంతేకాక ఎస్‌పి, బిఎస్‌పిలు తమ వైఖరిని మార్చుకుని కాంగ్రెస్‌కు సీట్లు కేటాయిస్తాయా, లేక కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా.. అన్నది కూడా చూడాలి. రాహుల్‌ తనకు శక్తి లేదని అంగీకరించినందువల్లే ప్రియాంకను రంగంలో దించారని బిజెపి నేతలు వాదిస్తున్నారు. రాహుల్‌ తన ఓటమిని ముందే అంగీకరించారని, అందుకే శూర్పణఖను రంగప్రవేశం చేయించారని అంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదు. ప్రియాంక రావడం వల్ల బిజెపికి నష్టం జరుగుతుందని వీరి వ్యాఖ్యలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి విమర్శలు కట్టిపెట్టి బిజెపి గత ఐదేళ్లలో సాధించిన విజయాలు చెబితే ప్రజలు సంతోషిస్తారు. ప్రియాంకను విమర్శించడం వల్ల కాంగ్రెస్‌ మరిన్ని రాళ్లు విసరడం ఖాయం. అవి నిజాంగానే దానిని దెబ్బతీసినా ఆశ్చర్యం లేదు. అందువల్ల బిజెపి ప్రియాంకను వ్యక్తిగతంగా విమర్శించడం మానుకుంటే మంచిది.