ప్రేమ పెళ్లి చేసుకున్నారని దాడిచేసిన తండ్రి

మరో ఘోర ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం
హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఘోరం జరిగింది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఘటన మరువక ముందే.. రాజధానిలో మరో దారుణ హత్యాయత్నం వెలుగుచూసింది. తమకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కారణంతో సందీప్(24) మాధవి(22)‌ జంటపై అమ్మాయి మేనమామ మనోహర చారి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సందీప్, మాధవి తమ బండి వద్ద నిలుచుని ఉండగా వారి వెనకే బైక్ పై వచ్చిన మేనమామ మనోహర చారి తన బ్యాగులోంచి కత్తి బయటకు తీసి దాడి చేశాడు.
ఈ దాడిలో సందీప్, మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.కులాంతర వివాహమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. మాట్లాడుకుందాం… రమ్మని పిలిచిన మాధవి మేనమామే ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి అనంతరం సందీప్ సోదరుడు స్పందిస్తూ మాధవి, సందీప్ ఇద్దరు మేజర్లేనని తెలిపారు. ఇద్దరూ బోరబండకు చెందినవారని తెలిసింది.