ప్రైవేట్ స్కూళ్లకు పెరుగుతున్న ఆదరణ
కేవలం ఇంగ్లీష్ విూడియమే ప్రధాన ఆకర్శణ
ఇబ్బడి ముబ్బడిగా ఫీజుల వసూళ్లు
పుస్తకాలు, డ్రెస్లుతో సమాంతర వ్యాపారం
విద్యారంగంపై సమగ్ర సవిూక్ష చేయాలి
హైదరాబాద్,మార్చి8(జనంసాక్షి): మారుమూల గ్రామాల్లో సైతం ప్రైవేట్ స్కూళ్ల వ్యాపారం మూడుపూవులు ఆరుకాయలుగా నడుస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన కెజి టూ పిజి పథకం ఇంకా పట్టాలకెక్కలేదు. దానిపై ప్రకటనలు తప్ప పథక ఆవిష్కరణ జరగడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ విూడియం లేకపోవడం రూరల్ విద్యార్థులకు శాపంగా మారింది. కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధించే టీచర్లు కూడా లేకపోవడం కారణంగా ప్రైవేట్ స్కూళ్లకు వరంగా మారుతోంది. ఓ రకంగా ప్రభుత్వ పాఠశాలల లోపాలు ప్రైవేట్ స్కూళ్లకు కలసి వస్తోంది. బడిగంటలు మోగబోతున్న తరుణంలో ప్రభుత్వం విద్యారంగంపై సమగ్ర సవిూక్ష చేసుకోవాల్సి ఉంది. ప్రధానంగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీపై నియంత్రణకు సంబంధించి ఇంకా ఓ నిర్ణయం రాలేదు. ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక సమర్పించడంతో ఫీజుల అదుపుపై పేరెంట్స్ ఆశగా చూస్తున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో నడుస్తున్న ప్రైవేట్ స్కూళ్లలో సైతం వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇకపోతే మోడల్,టెక్నో స్కూళ్ల సంగతి చెప్పక్కరలేదు. ప్రభుత్వ పాఠశాల్లలో చేర్పిస్తే తమ పిల్లల భవిష్యత్ ఎక్కడ దెబ్బతింటుందో అన్న ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు ఇంగ్లీష్ మోజులో పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. అరకొర వసతులు ఉన్నా, సరైన శిక్షణ ఉన్న టీచర్లు లేకున్నా పేరెంట్స్ పట్టించుకోవడం లేదు. దీంతో ఇకపోతే ప్రతి ప్రైవేట్ పాఠశాల సమాంతరంగా వస్తు వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. డ్రెస్సులు,పుస్తకాలు, టైలు, పెన్నులు, పెన్సిళ్లు ఇలా అన్నీ ఒకేచోట పెట్టి వ్యాపారం చేస్తున్నాయి. సరైన వసతులు లేకున్నా తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకుండా ప్రైవేట్ ఆకర్షణలో రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల చదువుకు లెక్కలు కడుతున్నారు. ఇక వీటిలో విద్యా ప్రమాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. సర్కార్ స్కూళ్లతో పోలిస్తే ఇవేవిూ గొప్పగా ఉన్న దాఖలాలు లేవు. ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేట్ పాఠశాలల్లోనే డొల్లతనం ఎక్కువగా ఉంటోంది. ప్రధానంగా గ్రావిూణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఉన్న చురకుదనం, నైపుణ్యం ప్రైవేట్ విద్యను అభ్యసిస్తున్న పట్టణ ప్రాంత విద్యార్థుల్లో కనిపించడం లేదు. నిరంతర సమగ్ర మూల్యాంకనం సందర్భంగా చేపట్టిన సర్వేలో ఇది బయటపడింది. ప్రధానంగా సృజనాత్మకత అన్నది ప్రైవేట్ విద్యార్థుల్లో కొరవడింది. మార్కులు తక్కువ వస్తే పాఠశాల పేరు పడిపోతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను మరో పాఠశాలకు పంపించే అవకాశం ఉంటుందని ప్రైవేట్ పాఠశాలలు మార్కులు వేస్తున్నాయి తప్ప, నిరంతర
సమగ్ర మూల్యాంకన పద్ధతిని అనుసరించడం లేదని తేల్చాయి. ఇలాంటి ఘటనలు పరిశీలనలో వెల్లడయ్యాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పోలిస్తే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు చురుకుగా వ్యవహరించడం లేదు. జనరల్ నాలెడ్జ్ విషయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగైన పద్దతి అవలంబిస్తున్నారు. ఒక్క ఇంగ్లీష్ బోధన సక్రమంగా ఉంటే ప్రైవేట్ కన్నా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయని తేలింది. దీనికితోడు ప్రైవేట్ విద్యార్థులు ఎక్కువగా ఇంటర్‌నెట్‌పై ఆధార పడుతున్నారు. అందుకే ప్రయోగాల విషయంలో కట్ అండ్ పేస్ట్ పద్ధతికి అలవాటు పడుతున్నారు. టీచర్లే దీనిని ప్రోత్సహిస్తున్నారు. ఇదే విధానంలో ప్రాజెక్టులు చేస్తున్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వ
పాఠశాలల్లో ప్రాజెక్టు పనులు సృజనాత్మకంగా ఉంటున్నాయని గుర్తించారు. డిజిటల్ పాఠాలు, మన టీవీ కార్యక్రమాల ను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫాలో అవుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇలాంటివి నామమాత్రం గానే ఉంది. అధిక ప్రైవేట్ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు జరగడంలేదు. ప్రైవేట్ పాఠశాలల్లో సీసీఈపై అవగాహన లేకపోవడం.. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్దేశం పక్కదారి పడుతోందని గుర్తించారు. దీనికితోడు బట్టీ విధానం విద్యార్థుల్లో సృజనను బయటకు తీయడం లేదు. తల్లిదండ్రుల మెప్పుకోసం, పాఠశాలల పనితీరు బాగుందని చెప్పుకోవడానికి మార్కులను ఇష్టం వచ్చినట్లుగా ఎక్కవ వేసి చూపుతున్నారన్న విషయం తేలింది. పరీక్షల నిర్వహణ తో పాటు మార్కుల కేటాయింపులో ప్రైవేట్ పాఠశాలల్లో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో పూర్వపు యూనిట్ టెస్టుల మాదిరిగా నిర్వహిస్తున్నారు. 80శాతం పాఠశాలల్లో అందరికీ ఒకే రకంగా మార్కులను కేటాయిస్తున్నారు. చాలా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులందరూ ఉపాధ్యాయులు చెప్పిందే రాస్తున్నారు. అంటే బట్టీ విధానం స్పష్టంగా బయటపడింది. విద్యార్థులు స్వయంగా ఆలోచించి, సమాచారం సేకరించి రాయాల్సి ఉన్నా ఆ దిశగా ఆలోచన చేయడంలేదు. కొన్ని పాఠశాలల్లో మూస పద్దతిలో ప్రశ్నలు ఇస్తున్నారని, దీని వల్ల ప్రయోజనం లేదని ధ్రువీకరించారు. ప్రైవుటే పాటశాలల్లో విద్య మిధ్య అన్న నిజాన్ని అధికారులు గుర్తించారు. చాలాచోట్ల బట్టీ విధానం తప్ప పిల్లలకు అవగమయ్యే రీతిలో బోధించడం లేదని గుర్తించారు. పలు ప్రైవేటు పాఠశాలల్లో గైడ్లు, పుస్తకాల పైనే ప్రధానంగా ఆధార పడుతున్నట్లు గుర్తించారు. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారే తప్ప విద్యార్థులకు అర్థమవుతుందో లేదో పట్టించుకోవటం లేదు. ఇవన్నీ ప్రజలకు చేరవేయడంలో విద్యాశాఖ విఫలం అవుతోంది. దీంతో ప్రైవేట్ రంగం వారు తమ ప్రకటనల చాతుర్యంతో పేరెంట్స్‌ను ఆకట్టుకుని స్కూళ్లలో పిల్లలను చేర్పిస్తున్నారు. ఇంగ్లీష్ విూడియంతో కెజి టూ పిజి విద్య అమల్లోకి వస్తే తప్ప ఈ అసమానతలు తొలిగేలా లేవు.