ప్లాట్‌లను ఖాళీ చేయండి!

– వాటిని వేలంవేసి నిధులు సమకూర్చుకోవాలి
– సిబ్బందికి ఎయిరిండియా ఆదేశం
న్యూఢిల్లీ, మే3(జ‌నంసాక్షి) : సిబ్బందికి కేటాయించిన ఫ్లాట్లను ఖాళీ చేయాల్సిందిగా ఎయిరిండియా యాజమాన్యం ఉద్యోగులను కోరింది. ఢిల్లీలోని సిబ్బందికి కేటాయించిన ఫ్లాట్లను ఖాళీ చేయాలని సూచించింది. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ కాలనీలో ఎయిరిండియాకు 800 ఫ్లాట్లున్నాయి. వీటిలో 676 ఫ్లాట్లలో ఎయిరిండియా సిబ్బంది నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వీటిని ఖాళీ చేయించి వేలం వేసి నిధులు సమకూర్చుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. దీంతో ప్లాట్లను ఖాళీచేసే వేరు ఇళ్లు వెత్తుక్కోవాలని సిబ్బందికి సూచించింది. దీంతో పాటు సరైన ఇళ్లు వెతుక్కోవడంలో సిబ్బందికి సాయం చేస్తామని కూడా చెప్పింది. అయితే ఇక్కడ నివాసం ఉంటోన్న ఉద్యోగుల్లో చాలా మంది బయటి రాష్టాల్ర వ్యక్తులే. పిల్లల పాఠశాలకు దగ్గరగా ఉండేలా ఇళ్లు చూసుకోవడం ఇప్పట్లో చాలా కష్టమైన పనని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు ఈ సంస్థకు సోషల్‌ విూడియా ద్వారా మరిన్ని చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో సంస్థ గురించి గానీ,
పని వివరాల గురించి గానీ విూడియా, సోషల్‌ విూడియాలో మాట్లాడవద్దంటూ సిబ్బందికి సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా విషయంపై విూడియాతో మాట్లాడాల్సి వస్తే అందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఎయిరిండియా పనైపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు జోరుగా వ్యాపిస్తున్నాయని, వీటివల్ల సంస్థ మరింత సమస్యల్లో పడే అవకాశం ఉందని ఆ సంస్థ అధికారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆదేశాలు ఉల్లంఘించిన సిబ్బందిపై చర్యలు తప్పవని సంస్థ స్పష్టం చేసింది.