ఫరూఖ్తబ్దుల్లాను ఎలా నిర్బంధిస్తారు!?

ఆయన్ని వెంటనే విడుదల చేయాలి

దేశం అభివృద్ధి చెందితే ఆర్థిక మాంద్యం సంగతేంది?

• లోక్ సభలో విపక్షాల ఆందోళన

• కేంద్రం సర్కార్ తీరుపై మండిపడ్డ నేతలు

న్యూఢిల్లీ, నవంబర్ 18(జనంసాక్షి): ప్రస్తుత కశ్మీర్ పరిస్థితిపై విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి పార్లమెంట్ లో కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుత కశ్మీర్ పరిస్థితి ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ లా వుందని కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. 370 ఆర్టికలను రద్దు చేసినా, కశ్మీర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే వున్నాయని, కశ్మీర్ ప్రజలు తీవ్రవాదుల చేతిలో బలవుతూనే వున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యులు కశ్మీర్ పరిస్థితిని లేవదీశారు. దాదాపు 30 మంది కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పోయి కశ్మీర్ లో పరిస్థితిని సమీక్షించడానికి యూరోపియన్ సభ్యులకు అనుమతి ఉంటుంది కానీ, ఈ దేశపు నేతలకు మాత్రం అనుమతి ఉండదని అధీర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రాలకు ఎస్పీజీ భద్రతను ఎత్తివేయడాన్ని కూడా అధిర్ ప్రశ్నించారు. తమ నేత రాహుల్ కశ్మీర్ లో పర్యటిస్తానంటే కేంద్రం అనుమతి ఇవ్వలేదని, అదే యూరోపియన్ నేతలకు మాత్రం అనుతినిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫారూక్ అబ్దుల్లాను హౌజ్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సోమవారం లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ మాట్లాడారు. ఫారూక్ అబ్దుల్లాను అరెస్టు చేసి 108 రోజులు అయ్యిందన్నారు. ఇక్కడేం రాజ్యం నడుస్తోందని ఆయన ప్రశ్నించారు. ఆయన్ను పార్లమెంట్‌కు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అది ఆయన రాజ్యాంగ హక్కు అని అధిర్ అన్నారు. పార్లమెంట్ లో 370 రద్దు విషయంపై ఆగస్టు మాసంలో చర్చ నడుస్తుండగా, ఫరూక్ అబ్దుల్లాను గృహనిర్బంధంలోకి తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన విషయాన్ని అధీర్ గుర్తు చేశారు. మరి ఇప్పుడు జరుగుతోంది ఏందని అధీర్ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ఫరూక్ అబ్దుల్లా కస్టడీలోనే వున్నారని, ఇదేనా ప్రభుత్వం చేసే న్యాయమని ధ్వజమెత్తారు. అయితే ఈ అంశాన్ని లేవనెత్తిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో లేరు. దీంతో స్పీకర్ ఓం బిర్లా కల్పించుకొని మాట్లాడుతూ… ఆగగస్టు మాసంలో కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేసిన విషయం నిజమేనని, ఆ సమయంలో ఫరూక్ అబ్దుల్లాను ఇంకా అదుపులోకి తీసుకోలేదని ఓం బిర్లా వెల్లడించారు. అయితే ఫరూక్ గృహనిర్బంధంపై స్పీకర్ కార్యాలయానికి అధికారులు తెలిపిన విషయాన్ని స్పీకర్ ప్రస్తావిస్తూ… ఇంకా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తనకు సమాచారం అందలేదని, ఫరూక్ అరెస్టినట్లు ఇంకా తాను భావించడం లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఫరూక్ అబ్దుల్లాను ఎలా నిర్బంధిస్తారు!?