ఫలితాల ఎఫెక్ట్‌.. భారీ నష్టాల్లో మార్కెట్లు

ముంబయి: ఈరోజు కూడా స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి పతనం తదితర కారణాలతో సోమవారం భారీగా నష్టపోయి మార్కెట్లు ఈరోజు ఉదయం కూడా నష్టాలతోనే ఆరంభించాయి. నిన్న సాయంత్రం ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయడం మదుపర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే నేడు వెలువడుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌ 450 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 110 పాయింట్లకు పైగా నష్టపోయి 10370 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.45 సమయానికి సెన్సెక్స్‌ 507 పాయింట్ల నష్టంతో 34452.63 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 115.4 పాయింట్ల నష్టంతో 10373 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.29 వద్ద కొనసాగుతోంది.