ఫిబ్రవరి 8 వరకు ఎపి అసెంబ్లీ

గవర్నర్‌ ప్రసంగంలో మొదలైన సమావేశాలు

అమరావతి,జనవరి30(జ‌నంసాక్షి): ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 8 వరకు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు అసెంబ్లీకి సెలవుగా ప్రకటించారు. ఫిబ్రవరి 5న ఓటాన్‌ అకౌంట్‌ బ్జడెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న విభజన సమస్యలు..ప్రత్యేక ¬దాపై అసెంబ్లీలో చర్చ జరుగనుంది. ఫిబ్రవరి 6న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలపై చర్చించనున్నారు. అలాగే 7న సంక్షేమ, ఇతర శాఖలపై, 8వ తేదీన విజన్‌ డాక్యుమెంట్‌పై అసెంబ్లీలో చర్చ జరుగనుంది. ఈ మేరకు స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన జరిగిన బిఎఎసి సమావేశం నిర్ణయించింది. యధావిధిగానే వైకాపా సమావేశాలకు దూరంగా ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. గవర్నర్‌ నరసింహన్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ ఉదయం వెంకటపాలెం చేరుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.