ఫోటో రైట్ అప్: చొప్పదండిలో పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు

పంట నష్టపరిహారం 24 గంటల్లో చెల్లించాలి -చొప్పదండిలో పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన రైతులు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం
చొప్పదండి, అక్టోబర్ 6 (జనం సాక్షి ):చొప్పదండి నియోజకవర్గ పరిధిలో గత మార్చ్, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు 24 గంటల్లో పంట నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. వడగళ్ల వానకు నష్టపోయిన పంటలకు పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ చొప్పదండి మండల కేంద్రంలోని గుమ్లాపూర్ ఎక్స్ రోడ్ వద్ద చొప్పదండి పట్టణానికి చెందిన రైతులు రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతుల నిరసనకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం ,మండల నాయకులు సంఘీభావం తెలిపారు .ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మార్చి ఏప్రిల్ లో వడగండ్ల వానకు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతాంగానికి స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన ఎకరానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం నేటికి అందకపోవడం దారుణమని అన్నారు. 6 నెలల క్రితం కురిసిన వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వకపోవడం అన్యాయమని ఆరోపించారు .ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నీళ్లపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులు నష్టపోయి మళ్ళీ అప్పులు చేసి వ్యవసాయం చేసే పరిస్థితులు ఏర్పడటంతో రైతాంగం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు పక్షపాతిగా చెప్పుకునే ముఖ్యమంత్రికి ఏమాత్రం మానవత్వం ఉన్నా 24 గంటల్లో పరిహారం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రైతులను అన్నిరకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పురం రాజేశం, పట్టణ అధ్యక్షుడు ముద్దం తిరుపతి, నాయకులు పెరుమాండ్ల గంగన్న, మునిగాల రాజేందర్, నిజానపురం చందు, గోస్కుల కొమురెల్లి, పెద్ది శ్రీనివాస్, సంబోజి సునీల్, కనుమల్ల రాజశేఖర్, బత్తిని తిరుపతి, తోట కరుణాకర్, పురం చింటు , రైతులు పాల్గొన్నారు.