బద్వేలులో తిరుగులేని వైసిపి

అయినా గెలుపు కోసం పోటీపడి ప్రచారం
కడప,అక్టోబర్‌29(జనంసాక్షి):కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోవడంతో వైసీపీ గెలుపు ఏకపక్షమే అని రాజకీయంగా అంతా అనుకుంటున్నారు. దీనికితోడు జిల్లాలో వైసిపి బలంగా ఉండడంతో పాటు సిట్టింగ్‌ స్థానం కావడం వల్ల అధికార పార్టీకి తిరుగులేదన్న అభిప్రాయం ఉంది. ఆ నెల 30న పోలింగ్‌ జరిగి 2న కౌంటింగ్‌ జరుగనుంది. ఎన్నిక ఏకపక్షంగా సాగినా వైసిపి ప్రచారంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. రాయలసీమలో కీలక మంత్రులు ఇక్కడే తిష్టవేసి ప్రచారంలో దూకుడు పెంచారు. అయితే.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. టీడీపీ అధికారంలో ఉండగా నాటి మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ జిల్లాలో రాజకీయంగా కీలకచక్రం తిప్పారు. టీడీపీ అధికారం కోల్పోవడం, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో టీడీపీలో చక్రం తిప్పిన ఆ ఇద్దరు నాయకులు బీజేపీలో చేరారు. ఆ పార్టీలో కూడా కీలక నాయకులుగా ఎదిగారు. దీంతో జిల్లాలో వచ్చిన ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో గెలుపు ఏకపక్షమే అనుకున్న వైసీపీ విజయంకోసం పదునైన వ్యూహాలు రచించి అమలు చేయాల్సి వస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తామేమి తక్కువ కాదని అధికార పార్టీని దీటుగా ఢీకొట్టాయి. వెంకటసుబ్బయ్య మరణం వల్ల వచ్చిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి డాక్టరు సుధాను వైసీపీ బరిలోకి దింపింది. రాజకీయ సంప్రదాయానికి కట్టుబడి టీడీపీ పోటీ నుంచి విరమించుకుంది. దీంతో టీడీపీ ఓట్లను కూడా తమ ఖాతాలోకి వేసుకుని లక్ష పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాలన్నది వైసీపీ వ్యూహం. అది సాకారం కావాలంటే 85 శాతానికి పైగా పోలింగ్‌ జరిగేలా రాజకీయ వ్యూహాలకు అధికార పార్టీ పదును పెడుతోంది. అయితే.. వైసీపీ వ్యూహాలను చిత్తుచేసి టీడీపీ ఓటర్లను తమ వైపు తిప్పుకొని వైసీపీకి భారీగా గండికొట్టాలని ఓ పక్క బీజేపీ, మరోపక్క కాంగ్రె?స పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. దీనికి తోడు నిన్నటి వరకు ఎన్నికకు దూరంగా ఉన్న జనసేన స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోమని అధిష్టానం సూచించడంతో జిల్లా నాయకత్వం బీజేపీకి మద్దతు ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి సీపీఐ మద్దతు ప్రకటించింది. దీంతో ఈ రెండు పార్టీలకు ఇంకాస్త బలం పెరిగింది. 15 రోజుల నుంచి బద్వేలు కేంద్రంగా తిష్ట వేసిన కీలక నాయకులు ఓ పక్క ప్రచారం.. మరో పక్క కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ హావిూలను ఇచ్చారు. బీజేపీ నాయకులు కూడా ఓ అడుగు ముందుకేసి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమే కాదు.. ప్రతి గ్రామంలో
ఏజెంట్లను నిలబెట్టేందుకు రాజకీయంగా పావులు కదిపారు. ఈ బాధ్యతను గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్య నాయకుడికి అప్పగించినట్లు సమాచారం. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ ఓట్ల వేటలో సామాన్య ఓటర్లే కాదు.. టీడీపీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో..?