బలహీన వర్గాల స్పూర్తి ప్రదాత, ప్రముఖ తెలంగాణ వాది కొండ లక్ష్మన్ బాపూజీ ` సీఎం కేసీఆర్
హైదరాబాద్,సెప్టెంబరు 26(జనంసాక్షి):బడుగు, బలహీన వర్గాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రధాత, గొప్ప ప్రజాస్వామిక వాది అని సీఎం కేసీఆర్ కొనియాడారు. రేపు కొండ లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలు. ఈ సందర్భంగా బాపూజీని స్మరించుకున్నారు. సాయుధ పోరాట కాలంలో న్యాయవాదిగా సేవలందించి, ఉద్యమకారుల తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది అన్నారు. మహాత్మా గాంధీ అందించిన స్ఫూర్తితో భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారన్నారు.ఆ విలువలను జీవితాంతం పాటిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో ఆ స్ఫూర్తిని పంచారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం, తన జీవితకాలం కృషి చేశారన్నారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందని పేర్కొన్నారు. బాపూజీ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.స్వరాష్ట్రంలో టీఆర్ఎఫ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యానవన యూనివర్సిటీకి లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకుంటున్నట్లు గుర్తు చేశారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో అవార్డులు అందజేస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వినూత్న పథకాలు అమలు చేస్తూ చేనేత కార్మికులైన పద్మశాలీల అభ్యున్నతికై రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు.