బహిరంగ విచారణ చేపడతాం


– శబరిమల తీర్పును పునఃసవిూక్షించాలని 49పిటీషన్లు
– విచారణ చేపట్టిన సుప్రింకోర్టు
– జనవరి 22న బహిరంగ విచారణ చేపడతామని వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్‌13(జ‌నంసాక్షి) : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న తీర్పును పునఃసవిూక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ ప్రారంభించింది. దీనిపై 49రివ్యూ పిటిషన్లు దాఖలు కాగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణ చేపట్టిది. అలాగే, తీర్పు పునఃసవిూక్షపై దాఖలైన పిటిషన్లను బహిరంగంగా విచారించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు. దీనిపై వచ్చే జనవరి 22న బహిరంగ విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు మంగళవారం ఉదయం రివ్యూ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. బహిరంగ విచారణకు అనుమతించేది లేదని పేర్కొవడం గమనార్హం. మరోవైపు, సుప్రీంకోర్టులో దాఖలుచేసిన నాలుగు రిట్‌ పిటిషన్లపై కేరళ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా, వీటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ల విచారణ తర్వాతే రిట్‌ పిటిషన్లపై ఓ నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. కాగా, సుప్రీంతీర్పునకు వ్యతిరేకంగా సాగుతోన్న ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలిపింది. ఇందులో భాగంగా మంగళవారం కేరళలో రథయాత్ర పేరుతో అయ్యప్ప భక్తుల ఆందోళనకు మద్దతు తెలుపుతోంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీం తీర్పుతో కేరళ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో నెలవారీ పూజల కోసం తెరిచిన శబరిమల సన్నిధానంలోకి నిషేధిత వయసు మహిళలు ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలను భక్తులు, హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. కేరళ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పును తప్పక అమలు చేస్తామని ప్రకటిస్తుంటే, కాంగ్రెస్‌, బీజేపీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. శతాబ్దాలుగా కొనసాగుతోన్న సంప్రదాయానికి విఘాతం కలిగించేలా ఈ తీర్పు ఉందని భక్తులు ఆందోళన చేస్తున్నారు.