బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం
– నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా?
– విలేకరుల సమావేశంలో వైసీపీ నేత తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం, అక్టోబర్19(జనంసాక్షి) : తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ఎక్కడాకూడా కనబడటంలేదనీ, సాయం చేయమని అడిగితే ప్రజలపై అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. బాధితులకు ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు నాయుడు వైఫ్యల్యాన్ని ఎండగట్టారు. నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా? అని ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉంటే తుపానుపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి అచ్చెన్నాయుడు తనకు ఇష్టమెచ్చినట్టు మాట్లాడుతున్నారని.. బాధితులను ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తుపాను నష్టంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని తమ్మినేని ప్రశ్నించారు. తిత్లీ తుఫాన్‌ను కూడా టీడీపీ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవటం అంటే పైపైన తిరిగి ఫోటోలకు ఫోజులివ్వడం కాదని, చిత్తశుద్దితో బాధితులను ఆదుకోవాలని సీతారాం సూచించారు. అలా కాకుండా చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతలు కేవలం ఫొటోలకు ఫోజులిచ్చి తాత్కాలికంగా పర్యటిస్తూ వస్తున్నారని, ఫలితంగా శ్రీకాకుళం తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఎక్కడి సమస్యలే అక్కడి ఉన్నాయని అన్నారు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతూనే ఉన్నారని అవేదన వ్యక్తం చేశారు.