బాబుకు ప్రజల ఆకలి కేకలు..  వినిపించటం లేదా?


– ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో ప్రభుత్వం విఫలం
– వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి
శ్రీకాకుళం, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : తితలీ తుఫాను బాధితులకు న్యాయం జరిగేంతవరకు శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటానని చెబుతున్న ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజల ఆకలి కేకలు వినిపించటం లేదా అని వైసీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తితలీ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇంత భారీస్థాయిలో నష్టం జరుగుతుందని అంచనా వేసినా.. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జనం కనీసం మంచినీరు కూడా లేకపోవటంతో.. దాహంతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినా, వాటిని తగ్గించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. తమ అనుకూల మాధ్యమాల్లో ఆహా! ముఖ్యమంత్రి ఓ¬! అంటూ బయట ప్రపంచానికి ప్రసారం చేసుకుంటున్న అధికార పార్టీ నేతలను ప్రజలు తుఫాను బాధిత ప్రాంతాల్లో అడుగడుగునా నిలదీస్తున్న విషయం కనిపించటం లేదా అంటూ ప్రశ్నించారు.

తాజావార్తలు