బాబుకు షర్మిళ సవాల్
కర్నూలు: అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు.తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు.తాము గవర్నర్ వద్దకు వెళ్లి అవిశ్వాన్ని కోరుతామని,మద్దతు ఇస్తారో లేదో తెలుగుదేశం పార్టీ చెప్పాలని ఆమె అన్నారు. కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిళ ఎమ్మిగనూరు నియోజకవర్గ కె.తిమ్మాపురం బహిరంగ సభ శనివారం ప్రసంగిచారు.అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకుండా కాలయాపన చేస్తున్నారని ఆమె విమర్శించారు.ప్రజా సమస్యలను పట్టించుకోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని ఆమె అన్నారు.చంద్రబాబుకు మాత్రం ప్రభుత్వంపై విశ్వాసం ఉందని ఆమె వ్యగ్యంగా అన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టును చంద్రబాబు ఎన్నికల కోసం వాడుకొని వదిలేశారని ఆమె ద్వజమెత్తారు.వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిచేశారని చెప్పారు.గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకమని,దానికి విద్యుత్తు,మోటార్లు కావాలని ఆమె అన్నారు.విద్యుత్తును,మోటార్లను సమకూర్చడానికి ప్రభుత్వానికి మూడేళ్లు కూడా సరిపోలేదని ఆమె దుయ్యబట్టారు.వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నీటి సమస్యను తీరుస్తారని ఆమె హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరులోని గణేష్ రైసు మిల్లు నుంచి ఆమె శనివారం పాదయాత్ర ప్రారంబించారు.ఆమె పాదయాత్ర శనివారంనాడు 31వ రోజుకు చేరుకుంది.శనివారం 15 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు.రాత్రికి కోడుమూరి నియోజకవర్గంలో బస చేస్తారు.



