బాబును ముందస్తు ముగ్గులోకి లాగాలని చూస్తున్న వైకాపా!

 

 

 

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని వైకాపా ఎదురు చూస్తోంది. అధికరాంలోకి తామే వస్తామన్న ధీమాలో ఆ పార్టీ ఉంది. ఎన్నికలు జరగాలి..జగన్‌ సిఎం కావాలని వారంతా కోరుకుంటున్నారు. అందుకే తెలంగాణలో లాగా ముందస్తు సవాళ్లు విసురుతున్నారు. తన పాలనపై తనకు నమ్మకముంటే ఒంటరిగా ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబుకు సవాల్‌ విసురు తున్నారు. చంద్రబాబు వైకాపా బుట్టలో పడేంత అమాయకుడు కాదని తెలుసుకోవడం లేదు. నిజానికి కెసిఆర్‌ లాగా ముందుకు వెళ్లాల్సిన అవసరం బాబుకు లేదు. జమిలి ఎన్నికలకు వెళ్లడం ద్వారా బిజెపికి సవాల్‌ విసిరి మరోమారు విజయం సాధించాలన్న ఆలోచనలో బాబు ఉన్నారు. ఎన్నికలు జరిపితే గద్దెనెక్కాలని వైకాపా ఉంది. తెలంగాణలో ముందస్తుకు వెళ్లడం వల్ల విమర్శలు వస్తున్న తరుణంలో బాబును ముందస్తుకు వెళ్లాలని సవాల్‌ చేయడం వైకాపా మూర్ఖత్వం తప్ప మరోటి కాదు. అసెంబ్లీకి వెళ్లి పోరాడలేని వారు ప్రజల్లోకి వెళతామనుకోవడం మరో ఎంతవరకు సబబో చర్చ చేయాలి. సభలో నిలదీసే

అవకాశాలను వదులుకోవడం ప్రజలను విస్మరించడమే అవుతుంది. టీడీపీకి ఎలాంటి నైతిక విలువలు, సిద్ధాంతాల్లేవని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అంటున్నారు. ప్రజాభిమానం పొందలేకే.. దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్‌తో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడు తున్నారని ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తానిచ్చిన హావిూలు నెరవేర్చానంటూ ప్రజాతీర్పు కోరుతున్నారని, ఏపీలో మాత్రం చంద్రబాబు కలిసొచ్చే పార్టీలతో పొత్తు అంటూ లీకులిస్తూ తమాషా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ మతతత్వ పార్టీనో, లౌకిక పార్టీనో చెప్పుకోలేని దుస్థితిలో ఉందన్నారు. ఎన్నికల లబ్ధికోసమే చంద్రబాబు వెంపర్లాడతాడన్నారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీకి వ్యతిరేమంటూ సీపీఐ, సీపీఎంలను కలుపుకుని టీడీపీ ఎన్నికలకెళ్లిందని, 1999లో ఆ పార్టీల్ని వదిలేసి బీజేపీతో అతుక్కున్నారని తెలిపారు. 2004లోనూ బీజేపీతోనే కలసి పోటీచేశారని, కేంద్రంలో ఆ పార్టీ ఓడిపోవడంతో దాంతో లాభం లేదనుకుని 2009లో టీఆర్‌ఎస్‌తోసహా కమ్యూనిస్టులను కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేసిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. 2014లో మోదీతో కలసి ప్రచారం చేశారని, ఇప్పుడు మళ్లీ బీజేపీ మతతత్వపార్టీ అని, ముస్లింలకోసం ఆ పార్టీని దూరం పెడుతున్నామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. స్వలాభంకోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడన్నారు. నిజానికి ఇవన్నీ రాజకీయంగా అవసరాలను బట్టి తీసుకునే నిర్ణయాలు. వైకాపా కూడా తన అవసరాలకు అనగుణంగానే పోతోందని గడికోట గుర్తించడం లేదున. కెసిఆర్‌ లాంటి దమ్ము, ధైర్యం చంద్రబాబుకుందా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హావిూలన్నీ నెరవేర్చానని, పథకాలన్నీ ప్రజాదరణ పొందాయని చెప్పే వ్యక్తి ఎన్నికలకు ఎందుకు వెళ్లట్లేదని నిలదీశారు. ఐదేళ్లు అధికారంలో ఉండే అవకాశం ఉండగా ముందస్తుకు వెళ్లాల్సిన అసవరం బాబుకు లేదు. ఇది తెలుసుకోలేక వైకాపా విమర్శలు చేస్తోంది. ఎన్నికల హావిూలన్నీ నెరవేర్చానని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం దారుణమంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటేస్తే తాము ఆ క్షణంలోనే అసెంబ్లీకి హాజరవుతామని అంటున్నారు. అయితే ఇదే విషయాన్ని అసెంబ్లీలోనే నిలదీయాలి. అసెంబ్లీ ప్రజాస్వామ్య పద్ధతిలో నడిస్తే తాము కచ్చితంగా హాజరవుతామని అంటున్నారు. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్య పరిరక్షణ పార్టీల బాధ్యతని, చట్టసభలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన సూచనలను ప్రస్తావించారు. అయితే గతంలో వైఎస్‌ అధికారంలో ఉండగా ఎలాంటి ఫిరాయింపులు జరిగాయో చెబితే వైకాపా చిత్తశుద్దిని కూడా అంతా అభినందించేవారేమో?