బాబుపై నాన్‌బెయిల్‌ వారెంట్‌ను..  నిలుపుదల చేయండి


– గవర్నర్‌ను కలిసిన టీటీడీపీ నేతలు
– కేసీఆర్‌, మోదీలు కలిసి బాబుపై అక్రమ కేసులు పెడుతున్నారు
– తెదేపాను నిర్వీర్యం చేసేలా కుట్ర చేస్తున్నారు
– వారి కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) : ఏపీ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్ర ప్రభుత్వం అందించిన నాన్‌బెయిల్‌ అరెస్టు వారెంట్‌లను వెనక్కు తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని టీటీడీపీ నేతలు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నర్సింహన్‌ను కోరారు. తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ నేతృత్వంలో ఆ పార్టీ
నేతలు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. బాబ్లీ వివాదంలో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం రమణ విూడియాతో మాట్లాడారు. కేసీఆర్‌, మోదీ కలిసి ఏపీ సీఎం చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని ఎల్‌.రమణ ఆరోపించారు. బాబ్లీ పూర్తయితే ఎస్సారెస్పీకి నష్టం జరుగుతుందనే చంద్రబాబు పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. కావాలని కేసీఆర్‌, మోదీలు కలిసి తెదేపాను దెబ్బతీయాలని చూస్తున్నాయని అన్నారు. ఎప్పుడో పదేళ్ల క్రితం కేసును ఇప్పుడు వెలుగులోకి తెచ్చి తెదేపాకు నష్టం చేయాలని, చంద్రబాబును దొంగదెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆనాడు పోరాటంచేసిందిన ఉత్తర తెలంగాణ ప్రజల బాగోగుల కోసమేనని, అలాంటి కేసీఆర్‌ చంద్రబాబు అండగా ఉండాల్సింది పోయి స్వార్థ రాజకీయాల కోసం మోదీతో కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గమనిస్తున్నారని తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబుపై అలాంటి సెక్షన్లు పెట్టడం అక్రమమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ఆనాటి కేసులు నేడు తెరపైకి తీసుకురావడంలో భాజపా పాత్ర ఉందని తాము అనుకుంటున్నామని, మహారాష్ట్రలోని భాజపా ప్రభుత్వం కావాలనే మళ్లీ కేసును తిరగదోడిందని గవర్నర్‌కు తెలిపినట్లు రావుల చెప్పారు. మా వినతి పట్ల గవర్నర్‌ సానుకూలంగా స్పందించారన్నారు.  మహారాష్ట్ర గవర్నర్‌తో మాట్లాడుతారో…కేంద్రంతో మాట్లాడుతారో గవర్నర్‌ ఇష్టం అని ఆయన చెప్పుకొచ్చారు. బాబ్లీపై మేం చేసిన పోరాటాలను హేళన చేస్తూ కేసీఆర్‌ మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎంకు ప్రజలే బుద్ధి చెబుతారని  చెప్పుకొచ్చారు. ఈ భేటీలో టీ.టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.